జయప్రకాశ్ నారాయణ, వీవీ లక్ష్మీనారాయణ – వీరిద్దరి కి చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరు కూడా బ్యూరోక్రాట్స్ గా ఉంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా అని స్వంత పార్టీ స్థాపిస్తే, లక్ష్మీనారాయణ ఆ దిశగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత జన సేన లో చేరిపోయారు. అయితే ఇటీవల జన సేన పార్టీని వీడుతూ, పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నందుకే తాను పార్టీ వీడుతున్నా అని ప్రకటించిన లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై జయప్రకాష్ నారాయణ స్పందించారు. ఆయన స్పందన చూస్తే పరోక్షంగా జేడీ లక్ష్మీనారాయణకు చురకలు అంటించినట్లు గా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, ” పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ కళాకారులు కాబట్టి, ఆయనకు హీరోగా బాగా ఆదరణ ఉంది కాబట్టి, ఆయన నటిస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. కాని ఆయన అవన్నీ వదులుకుని రాజకీయాలలోకి వచ్చారు. అయితే ఈ రాజకీయాలు అనేది దీర్ఘకాలిక పోరాటం. ఒక రోజు లో అధికారంలోకి వచ్చేది కాదు, అలా ఒక్క రోజులో అధికారంలోకి రావాలని ఆయన ఉబలాట పడలేదు కూడా. మరి రాజకీయంలో ఉన్న వారు తమ సొంత వ్యాపారం లేదా వృత్తి చేపట్టడం తప్పు ఎందుకు అవుతుంది. చట్టబద్ధమైన ఆదాయం ఉంటే ఎందుకు తప్పు అవుతుంది. అలా కాకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి లేదా రాజకీయాన్ని దుర్వినియోగం చేసో లేదంటే లంచాలకు పాల్పడో డబ్బు సంపాదించుకుంటే అది తప్పు అవుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా తన కుటుంబాన్ని, జీవితాన్ని నిజాయితీ గా గౌరవం గా జీవించే ఈ అవకాశాన్ని కల్పించుకోవడం ని గౌరవిస్తుంది. కానీ మన దేశంలో మాత్రం చాలా మంది రాజకీయంలో ఉన్న వారిని మీరు ఏం చేస్తారు అని అడిగితే రాజకీయం లో ఉన్నానండి అని చెబుతారు. మరి మీ సంపాదన ఎలా అంటే దానికి నోరు మెదపరు. అయినా వారు చేసే ఖర్చులకు వారికి చట్టబద్ధంగా వచ్చే ఆదాయానికి అసలు పొంతన ఉండదు. అలాంటి వారికి రాజకీయమే ఆదాయం అయిపోయింది. ప్రజలం మనం కూడా ఇది మామూలే అనుకుంటున్నాం. ప్రజా జీవనం బాగుపడాలని కోరుకుంటూ రాజకీయాలు చేసేవారు చట్టబద్ధంగా వృత్తులు వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదు. అటువంటి వాటిని మనం ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ రాజకీయాలు చేయడం సాధ్యం కాదు కానీ ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగులు వారి సంస్థ ఒప్పుకుంటే, వారు ఉద్యోగాన్ని కొనసాగిస్తూ కూడా రాజకీయం చేసుకోవచ్చు. నిజాయితీగా గౌరవప్రదంగా సంపాదించుకుంటున్నప్పుడు ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయన తన పార్టీని కాపాడుకోవడానికో, లేదంటే తన చుట్టూ ఉన్న వారి భవిష్యత్తు గురించి ఆలోచించో సినిమాల్లో నటిస్తే దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు” అని చెప్పుకొచ్చారు.
మొత్తానికి జెడి లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి అంగీకరించాడు అన్న దాన్ని సాకుగా చూపించి పార్టీ వీడి వెళ్లిపోవడం పై జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి ఆయన వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనస్తత్వం కలవాడు అని వ్యాఖ్యానించడం ఆయన అభిమానులను నొప్పించింది. దీంతో వారు కూడా, అసలు జె డి లక్ష్మీనారాయణ లోక్సత్తా అధ్యక్ష పదవి తీసుకోవడానికి సిద్ధమవడం ని, జన ధ్వని పేరుతో మరొక పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేయడాన్ని, ఆ తర్వాత జన సేనలో చేరడాన్ని ప్రస్తావిస్తూ, వీటిని ఆధారంగా వి.వి లక్ష్మీనారాయణ ది కూడా నిలకడ లేని మనస్తత్వం అనొచ్చా అని ప్రశ్నిస్తున్నారు.
జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై వీవీ లక్ష్మీనారాయణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.