లోక్‌సత్తా పేరుతో సంస్థను స్థాపించి..దాన్ని రాజకీయ పార్టీగా మార్చి.. మొదటికే మోసం తెచ్చుకుని … ఉన్న పేరంతా పోగొట్టుకున్న జయప్రకాష్ నారాయణ అలియాస్ జేపీకి .. పార్లమెంట్ సభ్యుడిని కావాలనే కోరిక మళ్లీ చిగురించింది. ఈ సారి ఆయన ఏపీపై దృష్టి పెట్టారు. వైఎస్ రెండో సారి గెలవడంలో పీఆర్పీతో పాటు ఈ జేపీ పార్టీ లోక్ సత్తా కూడా ఎంతో సాయం చేసింది. అది ప్రీ ప్లాన్డా లేకపోతే.. జేపీ రాజకీయ ఆశలు కోసం ఇలా చేశారా అన్నది పక్కన పెడితే ఆ తర్వాత.. అభ్యుదయం చెప్పే తన పార్టీ నేతలనే ఆయన కంట్రోల్ చేయలేకపోయారు.
చివరికి విసుగొచ్చి .. లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా క్యాన్సిల్ చేసేశారు. పాత సంస్థలాగా మార్చారు. కానీ ఇప్పుడు ఆ సంస్థ తరపున ఏపీలో చిన్న చిన్న సమావేశాలు పెట్టి.. ఏపీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఉందని .. తమ వారితో అనిపిస్తున్నారు. మీడియాలో చెప్పిస్తున్నారు. లోక్‌సత్తాను మళ్లీ పార్టీగా రివైవ్ చేసి .. ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం ఏమైనా ఉందేమో కానీ జేపీ తీరుపై మాత్రం మరోసారి విమర్శలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో ప్రభుత్వాలను పొగడటానికి ప్రాధాన్యం ఇచ్చిన ఆయన.. ఇప్పుడు… రాజధాని విషయంలో సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంత కాలం ఇవ్వని సపోర్ట్ ఎందుకిస్తున్నారో ఆయనకే తెలియాలి. అయితే గతంలోలా ఓట్లను చీల్చేందుకు… రంగలోకి దిగితే మాత్రం ఈ మేధావి రాజకీయానికి అంతకంటే పతనం మరొకటి ఉండదు.