ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చినా – తొలి అడుగులోనే తనదైన మార్క్ చూపించాడు. బుచ్చిబాబు పనితీరుకి ఎన్టీఆర్ అంతటి స్టారే ఇంప్రెస్ అయ్యాడు. బుచ్చితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. బుచ్చి కూడా ఎన్టీఆర్ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామా రాసుకున్నాడు. కానీ.. ఎన్టీఆర్ ఫుల్ బిజీ అవ్వడంతో, బుచ్చికి టైమ్ ఇవ్వలేకపోయాడు. అయితే బుచ్చిబాబు కూడా ఏం నిరుత్సాహ పడలేదు. ఈలోగా మరో సినిమా చేద్దామన్న ఉద్దేశంతో మరో ప్రాజెక్ట్ పనుల్లో పడిపోయాడు.
ఎన్టీఆర్ కూడా బుచ్చిని వదులుకోదలచుకోలేదు. అందుకే ఇంత టైట్ షెడ్యూల్ లో కూడా బుచ్చి కథని పట్టాలెక్కించడానికి డిసైడ్ అయ్యాడు. 2022 జులై నుంచి సినిమా మొదలెడదాం.. అని బుచ్చికి మాటిచ్చాడట ఎన్టీఆర్. ఈలోగా బుచ్చిబాబు రెండో సినిమా కూడా పూర్తయిపోతుంది. అటు ఎన్టీఆర్ – కొరటాల ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది. వీలైతే.. బుచ్చిబాబుతో పాటు మరో సినిమానీ సమాంతరంగా పట్టాలెక్కించాలని, రెండూ ఒకే సమయంలో పూర్తి చేయాలనుకుంటున్నాడట ఎన్టీఆర్. కాకపోతే… బుచ్చిబాబుది పిరియాడికల్ డ్రామా. అందుకే… రెండు సినిమాల్నీ ఒకేసారి పూర్తి చేయడానికి ఈ సెటప్ ఏమైనా అడ్డొస్తుందేమో అని ఆలోచిస్తున్నాడట. ఏదేమైనా 2022లో ఎన్టీఆర్- బుచ్చిబాబు కాంబినేషన్ పట్టాలెక్కడం మాత్రం ఖాయం. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.