వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని… నార్నె శ్రీనివాసరావు కలిశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆయన.. చాలా తక్కువ మందికి పరిచయం కానీ.. జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామగా.. మాత్రం అందరికీ పరిచయమే. చాలా కాలంగా.. రాజకీయ ఆశలు ఉన్న నార్నె.. లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మర్యాదపూర్వకంగానే… జగన్ ను కలిశానని నార్నె శ్రీనివాసరావు చెబుతున్నా… రాజకీయం లేకుండా ఉండదన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా చిలుకలరి పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది.. నార్నె శ్రీనివాసరావు జీవిత లక్ష్యం. చంద్రబాబుకు సమీప బంధువు కావడంతో.. గతంలో.. టీడీపీలోనే ఉండేవారు. అప్పట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విపరీతంగా సంపాదించడంతో.. చిలుకలూరిపేటలో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి … రాజకీయంగా అదృష్టం పరీక్షించుకుందామనుకున్నారు. కానీ చంద్రబాబు చాన్సివ్వలేదు.
జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత.. అనూహ్యంగా.. చంద్రబాబు కుటుంబంతో విబేదాలొచ్చాయి. అంతకు ముందు స్టూడియో ఎన్ అనే చానల్ నిర్వహించేవారు. కుటుంబంలో విబేధాలు రాక ముందు ఈ చానల్ ను కొన్నాళ్ల పాటు లోకేష్ , అతని మిత్రబృందం నిర్వహించింది. అప్పట్లో విపక్షంలో ఉండేవారు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి నార్నె శ్రీనివాసరావు పేరు రాజకీయాల్లో పెద్దగా వినిపించడం లేదు. గత ఎన్నికలకు ముందు కూడా.. ఆయన జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యాయి. అయితే.. అప్పుడు కూడా.. అవకాశం లభించలేదు.
జూనియర్ ఎన్టీఆర్ కు.. టీడీపీకి మధ్య సంబంధాు గొప్పగా లేవని..కొడాలి నాని వైసీపీలో చేరినప్పటి నుంచి ఆయన భావాలు మారిపోయాయన్న ప్రచారం చాలా ఉద్ధృతంగానే సాగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చారు. కట్టె కాలే వరకూ.. తనది టీడీపీనేనని చెప్పుకొచ్చారు. అయితే ఆయన మామ అలా ఉండాల్సిన అవసరం లేదు కదా.. ఆయనకు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. జగన్ టిక్కెట్ ఇస్తానంటే.. కచ్చితంగా వైసీపీలో చేరిపోతారని చెబుతున్నారు. ఇప్పుడు అంతా జగన్ చేతుల్లో ఉంది..! జూనియర్ ఎన్టీఆర్ మామను పార్టీలో చేర్చుకుని జగన్ టిక్కెట్ ఇస్తే మాత్రం… రాజకీయంగా ఓ సంచలనం ఖాయం కావొచ్చు..!