ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు? తెలుగుదేశం అభిమానుల్ని వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఎన్టీఆర్ వస్తే.. టీడీపీ పరిస్థితుల్లో మార్పు వస్తుందని, కొత్త జోష్ వస్తుందని టీడీపీ అభిమానులు, పార్టీ లో కీలకమైన నేతలు నమ్ముతున్నారు. గత ఎన్నికలలో టీడీపీకి దూరంగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈసారి మాత్రం.. తన రాక ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం పై ఎన్టీఆర్ నర్మగర్భంగా స్పందించాడు. `ఎవరు మీలో కోటీశ్వరుడు`లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి సంబంధించి మీడియాతో ఇంక్ట్రాక్ట్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ సందర్భంగా రాజకీయాల ప్రస్తావన వచ్చింది. `మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు` అని అడిగితే…“ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. సందర్భమూ లేదు. నా సమాధానం మీకు తెలుసు..“ అని స్పందించాడు. మీడియా అడిగే ప్రశ్నలకు తగు రీతిలో స్పందించడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ పరిణితి చూపిస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ ఎప్పుడు ఎదురైనా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు మీడియా నుంచి దూసుకొస్తుంటాయి. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇబ్బందే. అందుకే పీఆర్ ముందుగానే పాత్రికేయుల్ని ఎలెర్ట్ చేస్తుంటుంది. `ఈ తరహా ప్రశ్నలు అడగొద్దు` అంటూ మీడియా ప్రతినిథులకు హింట్ ఇస్తుంది. ఎన్టీఆర్ విషయంలో ఇలాంటివి ఎప్పుడూ ఎదురు కావు. తాను ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి రెడీనే. సున్నితమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు ఎలా తప్పించుకోవాలో తనకు బాగా తెలుసు. ఈ విషయం ఈరోజు మరోసారి తేటతెల్లమైంది.