మక్కా మసీదు కేసులో ఎన్.ఐ.ఎ. కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులోని ఐదుగురు నిందితులూ నిర్దోషులే అని కోర్టు తేల్చేసింది. 2007 మే 18న హైదరాబాద్ లోని మక్కా మసీదులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మరణించారు. ఆ తరువాత చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో మరో తొమ్మిది మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కె. రవీంద్ర రెడ్డి తుదితీర్పు ఇచ్చారు. అయితే, అనూహ్యంగా… ఈ తీర్పు ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆయన రాజీనామా చేశారు. దీంతో జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే ఆయన ఎందుకు రాజీనామా చేశారనే చర్చ మొదలైంది.
జడ్జి రాజీనామా నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయనపై ఏవైనా ఒత్తిళ్లు పనిచేశాయా..? ఇవ్వాలనుకున్న తీర్పును ఎవరైనా ప్రభావితం చేశారా..? తాను ఇచ్చిన తీర్పు సరైంది కాదని చెప్పకనే చెప్పాలన్న ఉద్దేశంతోనే ఇలా రాజీనామా చేశారా..? తీర్పు ఇచ్చిన వెంటనే రాజీనామా చేయడం ద్వారా వేరే సంకేతాలు ఇవ్వడం కోసమే ఆ పనిచేశారా.. ఇలా చాలా ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిజానికి, ఈ కేసు విచారణ 11 సంవత్సరాల పాటు సాగింది. ఎన్.ఐ.ఎ., సీబీఐ అధికారులు అన్ని రకాల ఆధారాలు సేకరించారు. 10 మంది నిందితులుగా గుర్తించారు. బాంబు పేలుడుకు స్థానికంగా సహకరించినవారి వివరాలనూ రాబట్టారు. ఇలా ఈ ఘటనకు సంబంధించి సమగ్ర సమాచారంతో 2014లో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇంత కీలకమైన కేసుకు సంబంధించిన తీర్పు పత్రాలను జడ్జి రవీందర్ రెడ్డి ముందురోజే సిద్ధం చేసుకున్నారట. కానీ, తీర్పు వెలువరించిన వెంటనే ఆయన రాజీనామా చేయడం విశేషం.
జడ్జి రాజీనామా ఈ కేసు తీర్పుతో ఏమాత్రం సంబంధం లేని అంశంగా కొట్టిపారేయలేం. ఒకవేళ ఆయన రాజీనామా చేయాలనుకుంటే… తీర్పు ఇవ్వడానికి ముందే చెయ్యొచ్చు, లేదా తీర్పు వెలువరించిన కొన్నాళ్ల తరువాత చెయ్యొచ్చు. కానీ, మక్కా మసీదు కేసులో తీర్పు ఇచ్చేసి.. బయటకి రావడం, వెంటనే హైకోర్టుకు రాజీనామా పత్రం పంపడమే ఇప్పుడు తీవ్ర చర్చనీయం అవుతోంది. మొత్తానికి, ఈ కేసు విషయంలో సరైన తీర్పే వెలువడిందా లేదా..? అసలైన నిందుల్ని వదిలేస్తున్నారా..? జడ్జి రాజీనామాతో ఇలాంటి ఊహాగానాలు చాలానే వినిస్తున్నాయి.