బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఏదీ కలిసి రావటం లేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే నెల గడుస్తున్నా ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. ఈడీకి తోడు సీబీఐ కేసులు పెట్టడం, రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పేర్కొంటున్నాయి.
అయితే, విచారణ తర్వాత కవితను కోర్టు ముందు ప్రవేశపెడుతున్న సమయాల్లో ఆవిడ అక్కడున్న జర్నలిస్టులతో మాట్లాడటంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టుకు వస్తున్న ప్రతిసారి కవిత విచారణ సంస్థలపై కామెంట్ చేస్తుండటంతో స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కవితకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటివి పునారవృతం కాకూడదని స్పష్టం చేశారు.
సోమవారం సీబీఐ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో కవిత సీబీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని… బీజేపీ కస్టడీ అని, బయట బీజేపీ చెప్పిందే లోపల సీబీఐ అడుతుందని… గత రెండు సంవత్సరాలు ఇదే నడుస్తోందంటూ కవిత కామెంట్ చేశారు. ఈడీ కేసులోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై దర్యాప్తు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయటంతో కోర్టు స్పందించింది.
తాజాగా సీబీఐ కస్టడీ ముగియటంతో కవితకు కోర్టు జ్యుడిషీయల్ రిమాండ్ ను పొడిగించింది. అయితే, తమ మూడు రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన ఫేక్ భూమి రిజిస్ట్రేషన్ కు చెందిన 14కోట్ల సంగతి తేలలేదని సీబీఐ పేర్కొంది. అంతేకాదు ఈ కేసులో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, కొన్ని పత్రాలను పరిశీలించి, విచారించాల్సి ఉన్నందున… కవితకు బెయిల్ వస్తే విచారణను ప్రభావితం చేస్తారని, సాక్ష్యులను బెదిరించే ప్రమాదం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది.