టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు మంగళవారం వెలువరించనుంది. ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు. చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ విజ్ఞప్తి పరిశీలించాలనికోరారు. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారన్నారు. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు సమర్పించారు.
చంద్రబాబు ను అరెస్ట్ చేసిన తరువాత ఈ 50 రోజుల్లో కొత్తగా పురోగతి లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అదే సమయంలో కొత్తగా ఆరోపణలు కూడా లేవని వివరించారు. చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ తో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపులాయర్ సిద్ధార్థ లూధ్రా సిద్ధమయ్యారు. అయితే.. సీఐడీ తరపు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమకు సమయం కావాలని కోరారు. దీంతో వాదనలు ఎప్పుడు వినాలన్న అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు.
ఇప్పటికే తనపై నమోదైన కేసుల్లో సెక్షన్ 17A వర్తిస్తుందని తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ పూర్తి అయింది. తీర్పు రిజర్వ్ అయింది. నవంబర్ ఎనిమిదో తేదీ లోపు తీర్పు వెలువడే అవకాశం ఉంది.