వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పై తీర్పును వచ్చే నెల పదిహేనో తేదీన వెల్లడిస్తామని సీబీఐ కోర్టు ప్రకటించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేశారు. ఆగస్టు 25న తీర్పు వెల్లడిస్తామని గతంలో సీబీఐ కోర్టు తెలిపింది. అయితే ఈ లోపు విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై కూడా విచారణ జరిగింది. ఈ రోజు సీబీఐ కోర్టు ప్రారంభమైన తర్వాత అదే అంశంపై విచారణ జరిగింది. ఇరు వైపుల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదన తర్వాత సీబీఐ కోర్టు వచ్చే నెల పదిహేనో తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది.
ఆ రోజున ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఏపీ రాజకీయవర్గాల్లో కూడా బెయిల్ పిటిషన్పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉంది. బెయిల్ రద్దు అవదని వైసీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. టీడీపీ నేతలు కూడా బెయిల్ రద్దు కావాలని కోరుకోలేదు. కానీ బయటకు మాత్రం చెప్పలేదు. ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. చివరికి ఆ టెన్షన్ మరికొన్ని రోజులకు వాయిదా పడింది. వచ్చే నెల పదిహేనో తేదీన తీర్పు చెబుతామని న్యాయమూర్తి ప్రకటించడంతో ఇప్పటికైతే వైసీపీ నేతలకు రిలీఫ్ దొరికింది.
జగన్, విజయసాయి ఇద్దరూ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని వేర్వేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లు దాఖలు చేశారు. మెరిట్ ప్రకారం కోర్టే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ చెప్పడంతో .. సీబీఐ అభిప్రాయం లేకుండా పోయింది. దీంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొని ఉంది.