ప్రభుత్వాలు చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను సరి చూసుకుని.. రాజ్యంగ పరంగా ఉన్నాయో లేదో.. సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మూడు రోజుల ఏపీ పర్యటనలో ఆయన పలు చోట్ల ప్రసంగించారు. న్యాయసదస్సులు.. రోటరీ .. ఇతర కార్యక్రమాల్లో ఆయన మాట్లాడిన ప్రతీ చోటా న్యాయ వ్యవస్థ ప్రభుత్వాల నుంచి ఎదుర్కొంటున్న సవాళ్ల గురించే ప్రస్తావించారు. రాజ్యాంగానికి ఏర్పడిన ముప్పు.. ప్రభుత్వాల దాడులు… న్యాయవ్యవస్థపై జరుగుతున్న సైబర్, డైరక్ట్ ఎటాక్స్ విషయంపై నిర్మోహమాటంగా జస్టిస్ ఎన్వీ రమణ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవస్థల్లో ఉల్లంఘనలు జరిగితే దాన్ని సరిదిద్దే పాత్ర న్యాయవ్యవస్థేనని గుర్తు చేశారు. ఇంటర్నెట్ కేంద్రంగా పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టడం.. బ్లాక్ మెయిల్ చే్యడం వంటివన్నీ న్యాయవ్యవస్థకు సవాళ్లుగా మారాయన్నారు. మనీ లాండరింగ్, వర్చువల్ కరెన్సీ ద్వారా క్రైమ్ ఫండింగ్ చేస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల జడ్జిలపై భౌతికదాడులు పెరిగాయి. అనుకూల తీర్పులు రాకుంటే జడ్జిలపై విమర్శలు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలపై విచారణ జరపాలని కోర్టులు ఆదేశిస్తేనే విచారణ ముందుకెళ్తోంది.. ఇది దురదృష్టకరం.
జడ్జిలకు స్వేచ్ఛ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత .. గృహ, వైద్య సదుపాయాలు కూడా సరిగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సహకారం ఉంటేనే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఆదివారం సాయంత్రం సీజేఐ గవర్నర్ రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. దానికి ఇతర న్యాయమూర్తులతో పాటు సీఎం జగన్ కూడా హాజరయ్యారు.