దర్యాప్తు సంస్ధల కార్యకలాపాపాల్లో న్యాయవ్యవస్ధ జోక్యం మితిమీరుతోందని న్యాయవ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. దర్యాప్తును పర్యవేక్షించడం, సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం వంటి సుప్రీంకోర్టు, హైకోర్టుల క్రియాశీలతను కమిటీ ప్రశ్నించింది.
2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గుబ్లాకుల కేటాయింపులు, వ్యాపం వంటి కోట్లాది రూపాయల కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తులను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్న నేపధ్యంలో పార్లమెంటరీ కమిటీ నివేదిక ” మితిమీరిన కోర్టుల జోక్యాన్ని ” ప్రస్తావించడం లెజిస్లేషన్, ఎగ్జిక్యూషన్, జుడీషియరీ లమద్య హద్దులపై మరో సారి హాట్ టాపిక్ అయ్యింది.
అవినీతి నిరోధకచట్టం 1988కు సంబంధించిన కేసుల విచారణ కోసం సుప్రీంకోర్టు, హైకోర్టులు తరచూ సీబీఐని ఆదేశించడాన్ని కమిటీ తప్పుబట్టింది. దీనిని పబ్లిక్ ఆర్డర్గా భావించాల్సి ఉంటుందని తెలిపింది. సీఆర్పీసీ లోని 172, 173 సెక్షన్లను పక్కకు నెట్టి అనేక కేసుల్లో రోజువారీ ప్రగతి నివేదికను సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలంటూ సీబీఐని అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులు ఆదేశించడం దేనికి సంకేతమని ప్రశ్నిం చింది. సిబ్బంది, ప్రజల సాధకబాధకాలు, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.
దర్యాప్తు పరిశీలన, కేసుల దర్యాప్తునకు సంబంధించి సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులు సూపర్పవర్గా వ్యవహరించడం బాధితులకు అన్యాయం చేసేల వుందని, న్యాయస్థానాలు అనేక అంశాల్లో జోక్యం మితిమిరిందని నివేదికలో వివరించారు..
రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో సీబీఐ ప్రత్యేకకోర్టుల ఏర్పాటు పట్ల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ద్వంద్వ న్యాయవ్యవస్థను(డ్యూయల్ జ్యుడీషియల్ సిస్టమ్) ప్రవేశపెట్టడమేనని, ఇలాంటి చర్యలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంటులకు ప్రత్యేకంగా విడివిడిగా అధికారాలు, విధివిధానాలు ఉన్నాయి. అయితే కోర్టుల చర్యలు వాటిని అతిక్రమించేలా ఉన్నాయని కమిటీ విమర్శించింది.