ఓ మహిళ ఓ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లింది. ఏమండి.. నన్ను మోసం చేస్తారా.. వీడు బిడ్డేనండి అని ఏడుస్తుంది. ..ఎవరీమె అని ఆ ఎమ్మెల్యే ఆశ్చర్యంగా చూస్తారు. అప్పటికి వెళ్లిపోతుంది. తర్వాత ఓ కెమెరా పట్టుకుని జర్నలిస్టు పేరుతో ఒకడు వస్తాడు. ఆ అమ్మాయిని మోసం చేశావు.. కొడుకు కూడా ఉన్నాడు..బయటపెడితే పరువు పోతుంది.. పదవి పోతుంది.. ఐదు కోట్లు ఇస్తే సీక్రెట్ గా ఉంచుతానంటాడు. కానీ ఆ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బండారం బట్టబయలు అయింది. ఇది కథ కాదు.. నిజంగానే జరిగింది.
జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు ప్రైవేటు వీడియోలు ఉన్నాయని.. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని బిడ్డను కన్నట్లుగా తెలిసిందని.. ఐదు కోట్లు ఇస్తే సైలెంట్ గా ఉంటామని లేకపోతే బజారున పెడతామని శ్యామ్ అనే యూట్యూబర్ అయన వద్దకు వెళ్లాడు. ఓ మహిళ కూడా ఇందులో భాగం అయింది. ఓ బిడ్డను పట్టుకొచ్చి ఇతడు మీ బిడ్డేనని ఆరోపించింది. పెద్ద డ్రామా చేశారు. కానీ ఆయన పోలీసులకు కబురు చేయడంతో శ్యామ్ తో పాటు ఆ కిలాడీ లేడిని అరెస్టు చేసారు.
రాజకీయాలు కాబట్టి నిజాలు తెలియక ముందే తన గురించి కథలు కథలుగా చెబుతారని భయపడిపోయి..డబ్బులు ఉంటే ఆ ఐదు కోట్లు ఇచ్చేసేవాళ్లు ఉంటారని అనుకుంటారు కాబట్టే.. యూట్యూబర్లు ఇలా బరి తెగిస్తున్నారు. శ్యామ్ అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న వద్ద పని చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు పట్టుకుంటే తాను డబ్బులకు బ్లాక్ మెయిల్ చేయలేదని..తన దగ్గర ఓ మహిళ వచ్చి కొన్ని విషయాలు చెప్పిందని..దాన్ని ఆయనకు చెప్పి.. మీ బ్రదర్ గా చెబుతున్నా జాగ్రత్తగా ఉండమని చెప్పానని అంతేనని కవర్ చేసుకున్నాడు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ యూట్యూబర్ల పై కాస్త ఎక్కువే దృష్టి పెట్టాలన్న డిమాండ్లు సామాన్యుల నుంచి పోలీసులకు వస్తున్నాయి.