శ్రీవారి సేవ చేయడానికి 29 మందితో పెద్ద దళాన్నే నియమించడానికి సిద్ధమయింది ఏపీ సర్కార్. ఇప్పటికి చైర్మన్ ను మాత్రమే నియమించారు. మిగతా వారిని నియమిద్దామంటే… ఒత్తిళ్లు పెరిగిపోయాయి. సీఎం జగన్ కాదనలేని వారి దగ్గర్నుంచి సైతం ఒత్తిడి రావడంతో.. ఆ సంఖ్య పెంచుకుంటూ పోయారు. ఇప్పుడది 29 దగ్గర తేలింది. ఆ మేరకు… ఆర్డినెన్స్ జారీ చేశారు. గతంలో 19 మంది సభ్యులు ఉండేవారు. వారే ఎక్కువ… వారికి జీతభత్యాలు, ఇతర సౌకర్యాల వల్ల స్వామివారికి అదనపు భారం అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఖ్యను 29కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ అయింది.
29 మంది పాలకమండలి సభ్యుల్లో 25 మంది అనధికారిక సభ్యులు, నలుగురు అధికారులు పాలకమండలిలో ఉంటారు. తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి ఎంపీ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. అయితే ఆర్డినెన్స్‌లో వీరి ప్రస్తావన కనిపించలేదు. వీరు సభ్యులుగా ఉంటారో లేదో క్లారిటీ లేదు. ఉంటే మాత్రం.. ఆ సంఖ్య 32కి చేరుకుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత రాష్ట్రంలో టీటీడీ పాలకమండలి సభ్యుల నియమాకానికి తీవ్ర ఒత్తిడి పెరిగిందని ముఖ్యమంత్రే ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.
సభ్యుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 25 మందిని బోర్డ్ లో సభ్యులుగా నియమించుకునేందుకు ప్రభుత్వానికి సౌలభ్యం ఉంటుంది. నలుగురు అధికారులను పాలకవర్గంలో సభ్యులుగా ఎప్పుడూ ఉంటారు. ఆర్డినెన్స్ రావడంతో త్వరలోనే టీటీడీ పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు…. పొరుగు రాష్ట్రాల నుంచే.. ఎక్కువ మంది టీటీడీ బోర్డులో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.