కశ్మీర్ ఫైల్స్.. రజాకార్ పైల్స్ లాంటి ఫైల్స్ కావివి. జంపింగ్ ఫైల్స్. అంటే ఎగిరెళ్లే ఫైల్స్. వాటికేమీ రెక్కలు ఉండవు. నిజంగానే ఎగిరెళ్లవు. కానీ మనుషులే వాటిని ఎగరేసి తీసుకెళ్తారు. ఈ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటే ప్రభుత్వ నిర్ణయాలను సంబంధించిన ఫైల్స్ అన్నీ ఎవరికి వారి ఇష్టారాజ్యంగా సృష్టించొచ్చు.. ముదుకు తీసుకెళ్లొచ్చు. అన్ని స్థాయిల్లోనూ చెక్ చేయాల్సిన పని లేదు. ఈ ఉత్తర్వులు వచ్చేశాయి.
ఉదాహరణకు ఓ వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేయాలనుకుంటే.. ఫైల్ క్రియేట్ అయిన దగ్గర నుంచి మంజూరు చేసే వరకూ కనీసం ఐదారు దశల్లో పరిశీలన ఉంటుంది. ఆ సాయం పొందాలనుకునే వ్యక్తి నిజమేనా.. ఆ ఖర్చులు నిజమేనా.. ఇలా అన్ని రకాల వడపోతలు చేసి చివరికి ఓకే చేస్తారు. దీని వల్ల అవినీతి జరగదని ఇలా చేస్తారు. అలాగే వివరాల ఖచ్చితత్వం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెచ్చిన జంపింగ్ ఫైల్స్ విధానంలో.. ఫైల్‌ను చివరి స్థాయి వ్యక్తి కూడా పెట్టి ఆమోదింపచేసుకోవచ్చు. కింది ఉద్యోగులతో సంబంధం లేదు. వారి సంతకాలు అక్కర్లేదు. ఒక వేళ ఆ ఫైల్ విషయంలో తేడా వస్తే కింది ఉద్యోగులకు బాధ్యత ఉండదా అంటే.. ఆ ఒక్కటీ అడగొద్దనే సమాధానం వస్తుంది.
ఏపీ ప్రభుత్వం అనేకానేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. రూల్స్ విరుద్ధంగా పాలన చేస్తోంది. నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే జీవోలను వెబ్ సైట్లో పెట్టడం ఆపేశారు. కోర్టులు చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇప్పుడు ఫైల్స్ ను కూడా అందరి వద్దకు కాకుండా.. రహస్యంగా నడిపించేందుకు.. జంప్ చేస్తున్నారు. ఇలాంటి తీరు వల్ల .. మారిపోయే ప్రభుత్వాలు.. రాజకీయ నేతలకు ఇబ్బందేమీ ఉండదు కానీ.. అధికారులు మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు.