కథా స్రవంతిలో మరో వారం గడిచిపోయింది. ఈవారం (జూన్ 16) మరి కొన్ని కథలు పాఠకుల ముందుకు వచ్చాయి. రచనా శైలి ఎలా ఉన్నా, వస్తువులో వైవిధ్యం కనిపించడం మంచి పరిణామం. నాన్న సెంటిమెంట్‌తో ఓ కథ, సాఫ్ట్ వేర్ కోణంలో మరో కథ, ఇద్దరు నడివయస్కుల మానసిక సంఘర్షణకు చిత్రం పడుతూ ఇంకో కథ… ఇలా జానర్లు మారాయి. మరింతకీ ఆ కథలెలా ఉన్నాయి? అందులో ఆకట్టుకొనే విషయాలేంటి?
కథ: నాన్నకు ప్రేమతో
రచన: గీత
పత్రిక: ఈనాడు
ఆదివారం ఫాదర్స్ డే. అందుకే ‘ఈనాడు’ సందర్భోచితంగా ఈ కథని ప్రచురించింది. కెరీర్లో ఎదిగి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే, ఆ ప్రయాణంలో మనకు దోహదం చేసిన చాలామంది కనిపిస్తారు. కానీ నిజమైన త్యాగం మాత్రం నాన్నదే. నాన్న ఇష్టాల్ని బాధ్యతలెప్పుడూ కమ్మేస్తుంటాయి. తమ బిడ్డలకు ఓ చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి తండ్రి తాపత్రయపడుతుంటాడు. అలా తన తండ్రి చేసిన త్యాగాల్ని, పడిన కష్టాల్నీ గుర్తు చేసుకొన్న ఓ కూతురి కథ ఇది. కథలోనూ, కథనంలోనూ కొత్తగా ఆవిష్కరించిన విషయాలేం లేవు. కాకపోతే.. ఇది మన నాన్న కథ. మన ఇంటి కథ. తండ్రి తాలుకూ స్వచ్ఛమైన త్యాగాల కథ. అమ్మాయిలెప్పుడూ నాన్న కూచీలే ఎందుకు అవుతారు? అనేదానికి మరో నిదర్శనం ఈ కథ. ‘మై డాడ్ ఈజ్ మై హీరో’ అని గర్వంగా చెప్పుకొనే ప్రతి ఒక్కరి మనసుల్నీ చేరే కథ ఇది.
కథ: అనాగరికుడు
రచన: డా.కె.వి.రమణరావు
పత్రిక: సాక్షి
చేయని తప్పుకు శిక్ష అనుభవించిన అమాయకుడు పీరయ్య కథ ఇది. తను ఓ ఫ్యాక్షనిస్టు దగ్గర డ్రైవర్. వృత్తి రీత్యా, స్వభావ రీత్యా… రౌడీ. కానీ స్వతహాగా ఆ మైలేమీ అంటని సగటు జీవి. నాగరిక ప్రపంచంలో బతకలేక, ఇక్కడి స్వార్థ్యాన్నీ, మేక వన్నె పులి తత్వాన్నీ జీర్ణించుకోలేక సతమతమైన ఓ మామూలు మనిషి. ఈ కథ ఆసాంతం చదివాక… చేయని తప్పుకు శిక్ష అనుభవించే పీరయ్య లాంటి వాళ్లు ఎంత మంది ఉన్నారో, తప్పు చేసినా దర్జాగా, మంచివాళ్లుగా చలామణి అవుతున్న పెద్ద మనుషులూ అంతేమంది ఉన్నారని అర్థమవుతుంది. పీరయ్యని చూస్తే జాలి, ఆ పెద్ద మనుషుల్నిచూస్తే భయం కలుగుతాయి. ‘మంట ఆరిన కాగడాలా కనిపించేవాడు’ లాంటి ఉపమనాలు అక్కడక్కడ నచ్చుతాయి.
కథ: ఎండ్ ఆఫ్ ది టన్నెల్
రచన: పాణిని జన్నాభట్ల
పత్రిక: ఆంధ్రజ్యోతి
తెలుగు కథకు ఇంగ్లీష్ లో పేరు పెట్టడంలో స్టైల్ ఉందనుకొంటారు చాలామంది. అయితే ఆ స్టైల్ ని ‘రాత’లోనూ ఫాలో అయిన కథ ఇది. ఆ ఫ్లో.. ప్రవాహం.. ఆకట్టుకొంటాయి. జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలనుకొనే ఇద్దరు నడి వయస్కుల కథ ఇది. భవిష్యత్తుపై ఆశతో అతడు, అనుమానాలతో ఆమె. ఎక్కడ, ఎవరి ముందు తగ్గినా ఫర్వాలేదనుకొనే మగాడు. తగ్గితే.. తప్పేమో అనే భయంతో ఆడది. వీరిద్దరి మధ్య.. ఏం జరిగిందన్నదే కథ. పాయింట్ పరంగా కొత్తగా ఏం లేదు కానీ, ప్రజెంటేషన్ మాత్రం బాగుంది. చాలా మాటలు అర్థవంతంగా సాగాయి. ఒక్కసారి.. ఆగి, ఆలోచించుకొని, మళ్లీ కథ చదవడం మొదలెట్టిన సందర్భాలు కొన్ని తగులుతాయి.
”కరెక్ట్ టైమ్‌కే వచ్చాను. ఫిఫ్టీన్ మినిట్స్ లేట్‌గా. నన్ను `డెస్పరేట్` అని అతను జడ్జ్ చేయకుండా”
”స్పష్టత నా శత్రువు” – లాంటి వాక్యాలు ఈ ప్రవాహంలో చాలా ఎదురవుతాయి.
ఈమధ్య కాలంలో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన మంచి కథల్లో (స్టైల్ పరంగా) ఇదొకటి.
కథ: ఒకరికి ఒకరు
రచన: సింగీతం ఘటికాచలరావు
పత్రిక: నమస్తే తెలంగాణ
చేసే పని పట్ల నిబద్ధత, నిజాయతీ ముఖ్యమని చెప్పే కథ ఇది. ఐటీ ఉద్యోగులు తరచూ వాడే `మూన్ లైట్` అనే పదానికి అర్థం ఈ కథ చదివితే తెలుస్తుంది. సాఫ్ట్ వేర్ రంగంలో పని చేసే వేలాది మంది ఇప్పుడు `వర్క్ ఫర్ హోమ్`కు అలవాటు పడిపోయారు. ఎప్పుడైతే పనిలో రిలాక్సేషన్ వచ్చిందో, అప్పటి నుంచీ సంస్థపై అభిమానం తగ్గుతూ, మరో సంపాదనపై ప్రేమ పెరుగుతూ పోతోందని విశ్లేషించిన కథ ఇది. రచనా శైలి కాస్త ప్రసంగ పాఠంలా ఉన్నా, ఈతరానికి అవసరమైన కథే అనిపిస్తుంది. ఈ కథలో ప్రస్తావించిన అంశానికీ, ‘ఒకరికి ఒకరు’ అనే టైటిల్ కీ సంబంధం ఏమిటన్నది ఎంతకీ అర్థం కాకపోవడం కొసమెరుపు.
– అన్వర్