కాసేపు అత్యంత ఐకమత్యంగా కనిపిస్తారు! మరుక్షణమే ఒకరంటే ఒకరికి పడదన్నట్టుగా ఉంటారు. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు అనేది ఎప్పట్నుంచో ఉన్న చర్చ. టి కాంగ్రెస్ నేతల్లో ఐక్యత సాధన కోసం హైకమాండ్ చాలారకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ, ఏదో ఒక రూపంలో అనైక్యత ఎప్పటికప్పుడు బయటకి వస్తూనే ఉంటుంది. తాజాగా గాంధీభవన్ కి సంబంధించి ఓ అంశం ప్రచారంలోకి వచ్చింది. పార్టీలోని సీనియర్ నేతలూ, జూనియర్ నేతల మధ్య కొన్ని రకాల అభిప్రాయాభేదాలు తరచూ వస్తున్నాయని తెలుస్తోంది. పార్టీకి సంబంధించి ఏదైనా కీలక సమావేశం ఉంటే… దానికి హాజరైన సీనియర్లు సీరియస్ గా వ్యవహరించడం లేదనీ, అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలపట్ల కూడా నిబద్ధత ప్రదర్శించడం లేదనేది కొందరు నేతల కామెంట్.
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి లాంటివాళ్లయితే సీనియర్ల తీరుపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ కష్టం కాలంలో ఉందని వారికి తెలిసినా, సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం కనిపిస్తున్నా సీనియర్ల తీరులో మార్పు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు! కొంతమంది సీనియర్ నేతలు చేస్తున్న పుల్లవిరుపు వ్యాఖ్యల వల్ల పార్టీలోకి కొత్తగా వస్తున్నవారిలో ఉత్సాహం నీరుగారిపోయేలా ఉందనేది వారి విమర్శ. ఇంతకీ, సీనియర్లు, జూనియర్ల మధ్య ఈ చర్చ మొదలవడానికి మూలం రెండు ఘటనలు ఉన్నాయి. మొదటిది.. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్భంగా కొంతమంది సీనియర్ నేతలు వ్యవహరించిన తీరు చర్చనీయమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు వెళ్లిన వీహెచ్ లాంటి సీనియర్లు అక్కడి పార్టీ శ్రేణులపై మండిపడిన తీరు కూడా వార్తల్లోకెక్కింది. అందరినీ కలుపుని కదలాల్సిన సీనియర్లు ఇలా వ్యవహరించడం సరికాదనేది కొందరి వాదన.
ఇక, రెండోది.. రేవంత్ రెడ్డి రాక! ఆయన గాంధీ భవన్ లోకి అడుగుపెడుతున్న రోజునే కొందరు సీనియర్లు జోకులు వేసుకున్నారట! జానా రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ లో ఉన్నది ఒక్క బాహుబలి మాత్రమే కాదనీ, చాలామంది ఉన్నారంటూ సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దీనిపై కూడా జూనియర్లు కాస్త ఆగ్రహంతో ఉన్నారట! ఇతర పార్టీల నుంచి నేతలు వస్తుంటే వారికి సహకరించాల్సింది పోయి, ఇలా వ్యంగ్యంగా మాట్లాడితే ఎలా అంటున్నారు. తెలంగాణలో పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడమే ఈ పరిస్థితి కారణమనే ఆవేదనతో కొంతమంది నేతలు ఉన్నారు. నిజానికి, ఈ పరిస్థితి హైకమాండ్ కి అర్థం కానిదేం కాదు. మరి, దిద్దుబాటు చర్యలు ఎలా మొదలౌతాయనేదే ప్రశ్న..?