హైదరాబాద్: కళ్యాణ్‌రామ్ వలన జూనియర్ ఎన్టీఆర్‌కు భారీగా నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ‘కిక్ 2’ ఫ్లాప్ అవటంవలన జూనియర్‌కు రు.12 కోట్లు నష్టం వచ్చినట్లు ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ చిత్రం బాగా లేట్ అయిందని, ఆ సమయంలో ఎన్టీఆర్ రు.6 కోట్లు ఇచ్చి ఆదుకున్నాడని కథనం. ఏప్రిల్ నెలలో విడుదలవ్వాల్సిన చిత్రం సెప్టెంబర్‌లో విడుదలయిందని, విడుదల సమయానికి మరో రు.6 కోట్లు బకాయిలు పేరుకుపోగా దిల్ రాజు ఆ మొత్తాన్ని కట్టి రిలీజ్ చేయించారని పేర్కొన్నారు. దిల్ రాజు కట్టిన రు.6 కోట్లకుగానూ అతనికి ఒక చిత్రాన్ని చేయటానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నట్లు ఆ కథనంలో రాశారు. ఈ చిత్రం ప్రస్తుతం సుకుమార్‌తో చేసేది పూర్తయిన వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ బకాయిల పంచాయతీ తేల్చటంకోసం లండన్‌లో షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ ఒకసారి హైదరాబాద్‌కు రావల్సి వచ్చినట్లుకూడా ఆ కథనంలో రాశారు.
మొత్తానికి సోదరప్రేమకు ఎన్టీఆర్ రు.12 కోట్లు మూల్యం చెల్లించారన్నమాట. ఇంతకుముందు కళ్యాణ్‌రామ్ తీసిన ‘పటాస్’ చిత్రంకూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుందని, ఎన్టీఆర్ జోక్యం చేసుకోవటంతో అది విడుదలైందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయినా వందలకోట్లకు అధిపతి అయిన మామ(నార్నె శ్రీనివాసరావు) ఉండగా ఎన్టీఆర్‌కు ఈ మొత్తం లెక్కేమీ కాదని అభిమానులు అంటున్నప్పటికీ, మొదట తనను కుటుంబ సభ్యుడిగా అంగీకరించటానికి నిరాకరించి చులకనగా చూసినవారికోసం ఎన్టీఆర్ ఇంత భారీమూల్యం చెల్లిస్తున్నాడంటే అతను గ్రేట్ అని చెప్పుకోక తప్పదు. మరి అతని ప్రేమను వారు అదేస్థాయిలో గౌరవిస్తున్నారో, లేదో చూడాలి.