కర్ణాటక ముఖ్యమంత్రి టాలీవుడ్ నుంచి ఒక్క జూనియర్ ఎన్టీఆర్కే ఆహ్వానం పలికారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ పిలుపునకు సంతోషం వ్యక్తం చేస్తూ.. వస్తానని తిరుగుటపా పంపారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు తమిళ పరిశ్రమ నుంచి రజనీకాంత్‌ను.. టాలీవుడ్ నుంచి జూ.ఎన్టీఆర్‌కు ఆహ్వానం పలికారు. సినీ ఇండస్ట్రీ స్థాయిలో రజనీకాంత్ లాంటి మెగాస్టార్‌ను పిలవాలంటే.. ముందుగా చిరంజీవిని ఆహ్వానించాలి. కానీ జూ.ఎన్టీఆర్ వైపే బస్వరాజ్ బొమ్మై మొగ్గు చూపారు. ఈ కార్యక్రమం కర్ణాటక అసెంబ్లీలో నవంబర్ 1న జరిగనుంది.
జూనియర్ ఎన్టీఆర్ కు కన్నడ నాట కూడా మంచి జనాదరణ పొందారు. తన ఆహ్వానంపై కర్ణాటక అసెంబ్లీలో జరిగే వేడుకలకు హాజరయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రకటించింది. కన్నడ ప్రజల్లో పునీత్ రాజ్ కుమార్ కు ఉన్న గౌరవానికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అత్యున్నత ‘‘కర్ణాటక రత్న’’ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా పునీత్ రాజ్ నిలుస్తారు. భారతరత్న తరహాలో కర్ణాటక రత్న పురస్కారాన్ని ఇస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక నుంచి ఎన్టీఆర్‌కు పిలుపు రావడం.. సీనియర్ స్టార్లను కాదని ఎన్టీఆర్‌ను మాత్రమే పిలువడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌ను పిలిచినప్పుడు చిరంజీవిని ఆహ్వానిస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. అయితే ఎవరిని పిలవాలన్న కర్ణాటక ప్రభుత్వం ఇష్టం. పునీత్ రాజ్ కుమార్, ఎన్టీఆర్ మంచి మిత్రులు కూడా.