మహారాష్ట్ర రాజకీయంలో తెల్లవారు జామున ఏర్పడిన ప్రకంపనలపై సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చింది. మొత్తం మీద.. ఈ వ్యవహారంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పాత్రేమీ లేదని.. తేలింది. అయితే.. ఆయన మేనల్లుడు… జూనియర్ పవార్.. అయిన అజిత్ పవార్.. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నేరుగా బీజేపీతో డీల్ మాట్లాడుకున్నారు. వెళ్లి ప్రమాణస్వీకారం చేసేశారు. ఈ విషయం తెలిసి… శరద్ పవార్ విస్మయానికి గురయ్యారు. వెంటనే.. ఆయనకు పార్టీతో సంబంధం లేదని చెబుతూ.. సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనతో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలు తర్వాత శరద్ పవార్ వద్దకు వచ్చేశారు. అజిత్ పవార్ పవర్ ప్లేతో.. శివసేన -ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమికి షాకిచ్చారు కానీ… ఆయన కనీసం 30 మంది ఎమ్మెల్యేలను తనతో తీసుకెళ్లకపోతే.. ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు.
అయితే… ఇప్పటికి మాత్రం ఆయన వెంట ఆరేడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అజిత్ పవార్ ను పావుగా వాడి.. బీజేపీ కొట్టిన మాస్టర్ స్ట్రోక్ ను కాచుకునేందుకు శివసేన -ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాయి. మహారాష్ట్ర గవర్నర్ .. దేవేంద్ర ఫడ్నవీస్ ను.. వారంలోగా.. బలం నిరూపించుకోవాలని సూచించారు. వారంలో నాటకీయ పరిణామాలు జరిగి.. ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించగలిగితేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేకపోతే… శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది. తెల్లవారు జామున రాష్ట్రపతి పాలన ఎత్తేసి.. గంటల వ్యవధిలోనే.. ఎలాంటి రాజ్యాంగ ప్రమాణాలు పాటించకుండా.. ఫడ్నవీస్ తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం కలకలం రేపుతోంది. ఈ విషయంపై బీజేపీపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెజార్టీ నిరూపించుకోలేకపోతే… ఆ విమర్శలు మరింత పెరుగుతాయి.
విశేషం ఏమిటంటే.. శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమిలోనూ.. అజిత్ పవార్ కు… డిప్యూటీ సీఎం పదవి ఉంది. కానీ ఆయన బీజేపీ వైపు వెళ్లిపోయారు. అక్కడా డిప్యూటీ సీఎమ్మే. కానీ.. ఉంటుందో..ఊడుతుందో తెలీదు. బలం నిరూపించుకోలేకపోతే.. ఆయన బీజేపీలో చేరాల్సిందే. శరద్ పవార్ కుటుంబానికి దూరమైనట్లే. అయితే.. అజిత్ పవార్ పై.. ఓ పాతికవేల కోట్లకు సంబంధించిన ఈడీ కేసు ఉందని.. దాన్ని చూపించి.. బెదిరించి.. లొంగదీసుకున్నారన్న విమర్శలు.. అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.