తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల లొల్లి కనిపిస్తోంది. అగ్రనేతల సమక్షంలో చేరుతామని నేతలు అంటున్నారు. కానీ ప్రతీ ఒక్కరి చేరికకూ అగ్రనేతలు ఎలా రావాలని .. వారికి ఆ స్థాయి లేదని కొంత మంది అడ్డం పడుతున్నారు. తాజాగా జూపల్లి నిర్వహించాలనుకుటున్న కొల్లాపూర్ సభ డౌట్ గా మారింది. పాలమూరు ప్రజాభేరి అనే పేరు పెట్టి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇరవయ్యో తేదీన ముహుర్తం ఖరారు చేశారు. కానీ ప్రియాంకా గాంధీ నుంచి కన్ఫర్మేషన్ రాలేదు.
ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన ప్రజాభేరి సభను మరొక రోజు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో పాటు మరి కొందరు నాయకుల చేరిక వాయిదా పడింది. నెల రోజుల నుంచి ప్రియాంకా గాంధీకి అనువైన తేదీ కోసం చూస్తున్నారు. కనీసం ఫలానా తేదీ అని చెప్పినా ఏర్పాట్లు చేసుకునేవారు. ఏమీ చెప్పకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. ఈ నెల 23 లేదా 28, 30వ తేదీల్లోని ఏదో ఒక రోజు సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం పాలమూరు జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అప్పటికి ప్రియాంక గాంధీ పర్యటన ఖరార్‌కాకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు రావడం ఖాయమని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.. అయితే ఇందుకు జూపల్లి సిద్ధంగా లేరు. ఖమ్మం సభకు రాహుల్‌గాంధీ వచ్చినట్లుగా.. పాలమూరు ప్రజాభేరి సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రావాలని అంటున్నారు. అయితే ఆ నేతలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కొంత మంది హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని.. అందుకే వాయిదా పడుతోందన్న ప్రచారం జరుగుతోంది.