గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. జులైలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి.. నెల తిరక్కుండానే ఇటీవల కేటీఆర్ ను కలవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లుగా ప్రచారం జరిగింది. ఆ పార్టీని వీడిన మరికొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లో చేరుతారని పెద్దఎత్తున ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ ప్రచారం నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే కేసీఆర్ ను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలవనున్నారని వార్తలు వస్తున్న క్రమంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ స్థానికంగా బండ్లకు సహకారం అందటం లేదు. గద్వాలలో బండ్ల , సరిత తిరుపతయ్య గ్రూప్ లుగా రాజకీయం నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
Also Read : రెచ్చగొట్టకు..కేటీఆర్ కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ గ్రూప్ రాజకీయాలతోపాటు స్థానిక నేతల నుంచి ప్రాధాన్యత లేకపోవడంతోనే బండ్ల తిరిగి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారని..అందుకే కేటీఆర్ ను కలిశారని, కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ను కలుస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఆయన తిరిగి బీఆర్ఎస్ లో చేరితే ఆ పార్టీ నుంచి వచ్చే నేతలు కూడా ఆలోచనలో పడిపోతారు. ఇది కాంగ్రెస్ లో చేరికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
దీనిని అంచనా వేసే.. బండ్లను బుజ్జగించి.. పార్టీలో సముచిత ప్రాధాన్యత ఉంటుందని నచ్చజెప్పేందుకు జూపల్లి కృష్ణారావు ఆయన నివాసానికి వెళ్ళారని అంటున్నారు. అయినా.. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.