హైదరాబాద్: తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలుగుదేశంపార్టీపై, చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం హయాంలో పాలమూరు జిల్లాకు ఎన్నినిధులు ఖర్చు చేశారనేదానిపై చంద్రబాబుతో అయినా, లేక చినబాబు లోకేష్‌తో అయినా చర్చకు సిద్ధమని చెప్పారు. శనివారం ఉదయం పదిన్నర గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వస్తానని, చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. బీమా ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక్క రూపాయైనా ఖర్చు చేశాడని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. చంద్రబాబు దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పాలమూరు ప్రాజెక్టుద్వారా 10 లక్షల ఎకరాలు సాగవుతుందని చెప్పారు. ఈ పథకంపై పాలమూరు టీడీపీ నేతల వైఖరేంటో చెప్పాలని, చంద్రబాబు చర్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ, టీడీపీ నేతలు ఒకే తానులో ముక్కలని అన్నారు.