తెలంగాణలో ఇప్పుడు డిమాండ్ ఉన్న నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణరావు. గట్టి నేతలుగా పేరున్న వీరిద్దరిని బీఆర్ఎస్ వదిలించుకుంది. వీరి బలంపై అనుమానం లేనప్పటికీ వర్గ పోరాటాలు.. ఇతర నేతల్ని వదులుకోలేని కారణంగా వీరికే గుడ్ బై చెప్పింది. వీరు ఇప్పుడు ఏ పార్టీలో చేరాలా అని వెదుకుతున్నారు అయితే వీరి ఆలోచనలు తమకు టిక్కెట్ ఇస్తే చాలు అనే దగ్గర లేవు మొత్తం జిల్లాల్నేతమ చేతుల్లో పెట్టాలని అంటున్నారు. దీంతో రెండుజాతీయ పార్టీలు ఆచితూచి అడుగులేస్తున్నాయి.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్క సారి మాత్రమే ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్లో చేరినప్పటికీ కేసీఆర్ ఆయనకు మరోసారి టిక్కెట్ ఇవ్వలేదు. వచ్చే సారి కూడా ఇచ్చే చాన్స్ లేకపోవడంతో వేరే దారి చూసుకుంటున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఓ వర్గాన్ని మెయిన్ టెయిన్ చేస్తున్నాడు. అభ్యర్థుల్ని కూడా ప్రకటించేశారు. తాను ఏ పార్టీలో చేరినా వారందరికీ టిక్కెట్ ఖాయమని చెబుతున్నారు.అందుకే ఏ పార్టీలో చేరాలనుకున్నా ఖమ్మం జిల్లా మొత్తాన్ని తన చేతుల్లో పెట్టాలని ఆయన కోరుతున్నారు. రెండు సీట్లు మినహా మొత్తం ఖమ్మం పొంగులేటి చేతుల్లో పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ లా బీజేపీ ఆఫర్లు ఇవ్వడం లేదు కానీ… పొంగులేటికి ఆహ్వానం పలుకుతోంది. గతంలోనే ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి పెట్టిన షరతులను బీజేపీ హైకమాండ్ పట్టించుకోలేదని చెబుతున్నారు. తనతో పాటు ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలన్న షరతును పెట్టారు. ఎంతో అత్యవసరం అయితే తప్ప చేరే నేతలు పెట్టే కండిషన్లకు బీజేపీ అంగీకరించదు. ఇక్కడా అదే జరిగిందని చెబుతున్నారు. అందుకే బీజేపీపై ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ లో చేరుతున్నా అనే పుకార్లను ఆయన వర్గమే సృష్టించిందన్న అంచనాలు ఉన్నాయి.
పొంగులేటి స్థాయిలో లేకపోయినా జూపల్లి కృష్ణారావు కూడా తనను సంప్రదిస్తున్నపార్టీల వద్ద పెద్ద చిట్టానే పెడుతున్నట్లుగా ఉన్నారు. గద్వాల జిల్లాపై తనకు పూర్తి ఆధిపత్యం ఆయన కోరుతున్నారు. కాంగ్రెస్ కంటే ఇప్పుడు బీజేపీకి ఎక్కువ నేతల అవసరం ఉంది. అందుకే బీజేపీపై ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ వైపు వెళ్తున్నామన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారని భావిస్తున్నారు.