2014లో టీడీపీ గెలవగానే.. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావు..ఇప్పుడు.. 2019లో వైసీపీ గెలవగానే.. మళ్లీ ఆ పార్టీలో చేరిపోయారు. టీడీపీ అధికార ప్రతినిధిగా.. ఐదేళ్ల పాటు.. వైఎస్ జగన్ తోపాటు… వైసీపీపైనా తీవ్ర విమర్శలు చేసిన.. జూపూడి ప్రభాకర్ రావు… జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తాము ఆలోచనల్లేకుండా.. గొర్రెల్లా వెళ్లి టీడీపీలో చేరిపోయామని.. తనను తాను తక్కువ చేసుకుని స్టేట్మెంట్ ఇచ్చి.. తిరిగి వైసీపీలో చేరడాన్ని సమర్థించుకున్నారు. మొదటి నుంచి జూపూడి ప్రభాకర్ రావు వైఎస్‌తో సన్నిహితంగా వ్యవహరించారు. ఆ తర్వాత జగన్ తో పాటు నడిచారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినప్పటికీ.. వైసీపీని వీడి.. టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలో అటు బాలినేని ఇటు వైవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఉన్న గొడవల కారణంగానే తాను ఓడిపోయానని ఆరోపించి.. ఆయన బయటకు వచ్చేశారు.
టీడీపీలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఓ సందర్భంలో ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా ఖరారు చేశారు. అయితే.. ఆయన తెలంగాణ ఓటర్ల లిస్టులో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఓటును ఏపీకి మార్చుకోకపోవడంతో.. ఎమ్మెల్సీ టిక్కెట్ చేజారిపోయింది. అయితే.. ఆయనకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఇప్పటి వరకూ పదవి అనుభవించిన ఆయన.. ఇప్పుడు.. మళ్లీ అధికార పార్టీ నుంచి పిలుపు రాగానే వెళ్లిపోయారు. సాధారణంగా తమను తీవ్రంగా విమర్శించిన వారిపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకునే వైసీపీ అగ్రనాయకత్వం జూపూడి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చింది.
మరో వైపు.. జనసేనకు రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బీజేపీ నేత అయిన ఆకుల… గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీలో చేరుదామని అనుకున్నారు కానీ.. వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో.. ఆయన వైసీపీలో చేరిపోయారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో… రాజమండ్రి నుంచి.. తన భార్యకు మేయర్ సీటు హామీతో ఆయన .. వైసీపీలో చేరినట్లుగా చెబుతున్నారు.