తెలుగుదేశం పార్టీకి జూపూడి ప్రభాకర్ రావు గుడ్ బై చెప్పారు. వెంటనే వైసీపీ కండువా కప్పుకున్నారు. మామూలుగా అయితే.. టీడీపీకి పెద్ద విషయం కాదు. కానీ ఆ పార్టీలో జూపూడి వ్యవహారం చాలా పెద్ద చర్చకు కారణం అవుతోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ… పార్టీలో .. జూపూడి వ్యవహారాన్ని ఓ గుణపాఠంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని ఇటీవలి కాలంలో కొంత మంది నేతలు వీడారు. వారి పార్టీ వీడటానికి టీడీపీ కారణం కాదు. బయట విషయాలు ఎక్కువ కారణం. ఎవరు పోయినా.. జరగనంత చర్చ ఇప్పుడు టీడీపీలో జూపూడి వల్ల జరుగుతోంది.
జూపూడి జంపింగ్ టీడీపీలో చర్చ జరగడానికి ప్రధాన కారణం… ఆయనకు పార్టీలో దక్కిన ప్రాధాన్యం. నిజానికి జూపూడి ఎప్పుడూ.. టీడీపీ సానుభూతి పరుడు కాదు. వైఎస్ హయాంలో.. ఆయనతో సన్నిహితంగా ఉండి రాజకీయంగా ప్రాధాన్యత పొందారు. తర్వాత జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. కానీ… టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిపోయారు. అనూహ్యంగా టీడీపీ అగ్రనాయకత్వం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన కూడా.. టీడీపీ హైకమాండ్ తనపై విశ్వాసముంచేలా… వైసీపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. కొన్ని కీలకమైన పదవులు.. ప్రాధాన్యత లభించింది. కానీ అనూహ్యంగా జూపూడి .. టీడీపీ ఓడిపోగానే.. వైసీపీలో చేరిపోయారు.
పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా.. ఇలా వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇలాగే జరుగుతుందన్న విమర్శలు టీడీపీలో ఓ రేంజ్లో ఇప్పుడు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోవర్టులుగా కొంత మంది పార్టీలోకి వచ్చారని టీడీపీ నేతలు ఇప్పుడు అనుమానిస్తున్నారు. అయితే.. పార్టీ అంతర్గత విషయాలు చాలా వరకూ బయటకు వెళ్లాయని… ఇలా వలస వచ్చిన వారే దానికి కారణమని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ అధినేత ఇక నుంచి అయినా.. పార్టీలో ఉన్న వారికి.., పార్టీలో కష్టడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ.. బయట నుంచి వచ్చిన వారికి కాదంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత కూడా ఇప్పుడు ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది.