ఏపీ, తెలంగాణ హైకోర్టుల నుంచి ఇద్దరు న్యాయమూర్తులను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్ దేవానంద్ .. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ దేవరాజు నాగార్జున్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. గత ఏడాది నవంబర్ లో హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబరు 24న సుప్రీంకోర్టులో కొలీజియం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని వివిధ హైకోర్టుల్లోని జడ్జిలను బదిలీ చేయాలని నిర్ణయించారు.
దేశంలో మొత్తం ఏడుగురు హైకోర్టు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులకు స్థానచలనం కలిగింది. ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలను వేర్వేరు ప్రాంతాలను బదిలీ చేశారు. తెలంగాణలో హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ నాగార్జున్ ను మద్రాస్ హైకోర్టుకు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల బదిలీపై న్యాయవాదులు అప్పట్లో ఆందోళన కూడా చేపట్టారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ బదిలీ సరికాదని న్యాయవాదులు అప్పట్లో నిరసన తెలిపారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని ఆరోపించారు. . ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై లాయర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని లాయర్లు విమర్శించారు. ఈ కారణంగా కొంత కాలం కేంద్రం ఆమోదించకపోయినా చివరికి నిర్ణయం తీసుకున్నారు.