న్యాయవ్యవస్థపై కుట్రలు చేసిన కేసులో విచారణ ఆపేయాలంటూ.. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు ఆదేశిస్తూ..ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం.. రామకృష్ణ అనే సస్పెండైన జడ్జికి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ చేశారు. కొంత మంది న్యాయమూర్తులపై ఆరోపణలు చేయాలని ప్రోత్సహించారు. అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆయన ఆడియో టేపుల్ని జడ్జి రామకృష్ణ బయట పెట్టారు. హైకోర్టుకు కూడా సమర్పించారు. ఈ విషయం మీడియాలో వచ్చిన తర్వాత ఈశ్వరయ్య కూడా ఆ వాయిస్ తనదేనని అంగీకరించారు.
ఆ తర్వాత అసలు కుట్రను వెలికి తీయాలంటూ.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్తో విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ ప్రారంభించిన జస్టిస్ రవీంద్రన్.. సీబీఐ, విజిలెన్స్ సహకారం తీసుకుంటున్నారు. కరోనా విషయంలోనూ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌పై ఓ కులసంఘం ఆరోపణలు చేసింది. ఆ కుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య. ఇవన్నీ కుట్ర ప్రకారం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్జి రామకృష్ణ వద్ద నుంచి ఈశ్వరయ్య మాట్లాడిన ఫోన్‌తో పాటు మరిన్ని వివరాలను సీబీఐ సేకరించింది. చురుకుగా దర్యాప్తు చేస్తోంది. జస్టిస్ రవీంద్రన్ కూడా ఇతర మార్గాల ద్వారా కోర్టులపై కుట్రలను తేల్చే పనిలో ఉన్నారు.
తెలంగాణకు చెందిన ఈశ్వరయ్య న్యాయమూర్తిగా రిటైరైన తర్వాత ఏపీలో రాజకీయం చేశారు. కులసంఘం పెట్టి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత జగన్ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు చేసి పదవి ఇచ్చింది. ఇప్పుడాయన ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు. జస్టిస్ ఈశ్వరయ్యకు.. న్యాయవ్యవస్థపైనా.. న్యాయమూర్తులపైనా.. నిందలు వేయించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన మరెవరి కోసమో.. న్యాయవ్యవస్థను టార్గెట్ చేయాలనకున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇలాంటి సమయంలో.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ.. ఈశ్వరయ్య సుప్రీంకోర్టుకు వెళ్లడం ఆసక్తి రేపుతోంది.