హైదరాబాద్లో కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. హైడ్రా ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఓ వైపు బాధితుల ఆర్తనాదాలు కూడా చూసేవారికి జాలి కల్పిస్తున్నాయి. కానీ ఇలా జాలి చూపిస్తే.. ఆ తర్వాత చెరువులేమీ మిగలవు. ప్రభుత్వ భూములేమీ మిగలవు. కానీ నిజంగా వారు కబ్జా చేశారా.. వారు తప్పు చేశారా అంటే… సమాధానం లభించదు. అసలు తప్పు చేసి దోచుకుంది ఒకరు.. బలైపోతుంది వీరు. వీరికి ఏదో ఒక న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం ఉంది.
కిష్టారెడ్డి పేట కూల్చివేతల్లో బాధితులు బడా బాబులే
కిష్టారెడ్డి పేటలో ప్రభుత్వ భూముల ఆక్రమణ చాలా కాలంగా జరుగుతోంది. బీఆర్ఎస్ చోటా నేతలు, పెద్ద నేతలు కలిసి ఈ ఆక్రమణలు పూర్తి చేసి.. భారీ బిల్డింగులు కట్టి అమ్మేశారు. వీటిని చంద్రశేఖర్ అనే బీఆర్ఎస్ అమ్మాడని చెబుతున్నారు. ప్రభుత్వ భూములు ఆయన ఎలా కబ్జా చేయగలిగారు..ఎలా అమ్మగలిగారన్నది బయటకు తీసి.. ఆయన ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో ..అందరికీ డబ్బులు ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూల్చివేతల విషయంలో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిష్టారెడ్డిపేటకు సమీపంలోని పటేల్ గూడలో చెరువు స్థలాన్ని ఆక్రమించేసి కట్టిన వాటిని కూల్చేశారు. అక్కడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకున్నారు. కొనుగోలు చేసిన వారికి న్యాయం జరగాల్సి ఉంది.
ఆక్రమణ కూల్చివేత మంచిదే – అమాయకులు బాధితులు కారాదు !
ఆక్రమించుకున్న వారు కడుతున్న సమయంలో ఇళ్లు కూల్చేస్తే సమస్య లేదు.కానీ అమ్మకం పూర్తయిన తరవాత కూల్చేస్తే ఎవరికి నష్టం. కాస్త తక్కువకు వస్తుందనో.. మరో కారణంతోనో అమాయకంగా కొనుగోలు చేసిన వారికే నష్టం. వారి తప్పు చాలా స్పల్పం. ఆ స్థలం ప్రభుత్వానిదో.. చెరువుదో అని తెలిసి కూడా అనుమతులు ఇచ్చిన వారి దగ్గర నుంచి సహకరించిన ప్రతి ఒక్కరిదీ బాధ్యతే. నష్టం మాత్రం చివరిలో కొనుగోలు చేసిన వారు భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మారేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది.
హైడ్రాకే ఆ బాధ్యత ఇవ్వాలి !
కూల్చివేతల విషయంలో హైడ్రాకు సర్వాధికారాలు ఇచ్చారు. పవర్ ఎక్కువ ఇచ్చారు. కానీ నిజంగా ఆ స్థలాలను కబ్జా చేసిందెవరు.. నష్టపోతోంది ఎవరు అన్నది కూడా లెక్కలేసి.. ఫస్ట్ కబ్జా చేసి అమ్మినోళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి.. చివరగా కొనుగోలు చేసిన వారికి అప్పగించాలి. లేకపోతే కూల్చివేతల వ్యవహారంలో ప్రభుత్వానికి మంచి కన్నా.. మానవత్వం లేదన్న పేరు వస్తుదంి.