చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవర్నీ సహించబోమని అన్ని వ్యవస్థలు హెచ్చరికలు చేస్తూ ఉంటాయి. అలా ఎవరు పడితే వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సమాజంలో అల్లకల్లోలం రేగుతుందని కనీస పరిజ్ఞానం ఉన్న వారికి తెలిసిన విషయం. అయితే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు మాత్రం.. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటేనే సమాజానికి న్యాయం జరుగుతుందని అంటున్నారు. మిగతా విషయాల్లో ఏమో కానీ.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారి విషయంలో మాత్రం.. అవుట్ ఆఫ్ లా నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ఆయన తేల్చేశారు.
దిశయాప్‌కు సంబంధించిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడేందుకు మైక్ దొరకగానే ఆయనకు.. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆవేశం వచ్చి పడింది. వెంటనే… ఆయన తనదైన స్పీచ్ ఇచ్చారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు భూమి మీదఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. సమాజానికి రక్షణగా ఉండాల్సిన మగాడు మృగంగా మారితే క్షమించకూడదన్నారు. అవుటాఫ్ లా అమలు చేస్తేనే సమాజానికి న్యాయం జరుగుతుందని.. మీ లాలు ఎలా పని చేస్తాయో నాకు తెలియదా అని పోలీసుల వైపు చూస్తూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దిశ కేసు విషయంలో ఎన్కౌంటర్లు చేసిన సజ్జనార్‌ను తమ్మినేని అభినందించారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని.. చట్టాలను.. రాజ్యాంగాలను అమలు చేయాలని చెప్పాల్సింది పోయి… చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని సూచించడం.. సహజంగానే అందర్నీ విస్మయపరుస్తోంది. రేపు ఈ అంశంపై ఆయన సవరణ చెబుతారేమో కానీ ఇప్పటికైతే హాట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజుల కిందట… చెట్లు, ఆక్సిజన్ , కార్బన్ డైయాక్సైడ్, కరోనా వైరస్‌కు కలగలపి చెప్పిన ఓ సూత్రంతో ఆయన వైరల్ అయ్యారు. అయితే.. ఏదో తప్పు చెప్పానని.. అలా వైరల్ చేయడం ఏమిటని తర్వాత ఆయనే చిన్నుబుచ్చుకున్నారు. అది మర్చిపోక ముందే.. మరోసారి తన వ్యాఖ్యలు వైరల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.