తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌కు ఎలాగైనా పదవి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మొదట ఎస్ఈసీ.. తర్వాత పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్‌గా పదవి ఇచ్చారు. ఈ రెండు పదవులు కోర్టుల్లో నిలబడలేదు. చివరికి ఓ కమిటీలో సభ్యుడిగా తాజాగా పదవి ఇచ్చారు. పీడీ చట్టం అంటే ప్రివెన్షన్ డిటెన్షన్ చట్టం అమలుకు ప్రతిరాష్ట్రంలో ఓ సలహా మండలి ఉండాలి. ఆ సలహా మండలిని ప్రభుత్వం నియమించింది. అందులో ప్రధానమైన పదవి చైర్మన్ ను కనగరాజ్‌కు ఇవ్వలేదు.
ఎప్పుడో 22 ఏళ్ల క్రితం ఉమ్మడి హైకోర్టులో పని చేసి రిటైరన జస్టిస్ సంజీవరెడ్డి అనే 85 ఏళ్ల పెద్దాయనకు చైర్మన్ పదవి ఇచ్చారు. సభ్యుడిగా మాత్రం కనగరాజ్‌కు చాన్సిచ్చారు. కనగరాజ్ తమకు ఉపయోగపడ్డారు కాబట్టి ఆయనకు ఏమైనా చేయకపోతే ఉపయోగించుకుని వదిలేశామన్న ఆరోపణలు వస్తాయని.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఏదో ఓ పదవిని వెదికి మరీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పదవి అయినా నిలబడుతుందో లేదో చెప్పడం కష్టమే.
పీడీ యాక్ట్ సలహా మండలి అంటే… ముందస్తుగా ఎవర్ని నిర్బంధం లోకి తీసుకోవాలని సలహా ఇచ్చే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో 80 ఏళ్లు పైబడిన వారికి పదవులు ఇవ్వొచ్చో లేదో స్పష్టత లేదు. ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తేనే కనగరాజ్‌కు ఈ పదవి కూడా ఉంటుందా.. ఊడుతుందా అనేది తేలుతుంది.