రాజకీయ పార్టీలన్నీ కులాలవారీగా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాపు కులస్తులను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల దృష్టి కాపు సామాజిక వర్గంపై పడింది. కనుక ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలు ఇదే అదునుగా రాజకీయంగా ఎదగాలని కలలుకంటున్నారు. కాపులను బీసీలలో చేర్చాలనే డిమాండ్ చిరకాలంగా ఉంది. కానీ వారి డిమాండ్ ను ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ పార్టీల కులసమీకరణాల కారణంగా అయితేనేమి లేదా సదరు సామాజిక వర్గానికి చెందిన నేతల ఒత్తిళ్ళ కారణంగా అయితేనేమి ఇప్పుడు వారి కోరిక ఫలించే అవకాశాలు కనబడుతున్నాయి.
కాపుల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి వారిని బీసీలలో చేర్చవచ్చా లేదా అనే విషయంపై నివేదిక ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం కర్నాటక హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ మంజునాద్ కమీషన్ నేతృత్వంలో ఒక కమిటిని నియమించింది. ఆ కమిటీ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతోంది. కాపులలో బలిజ, తెలగ, బలిజ, ఒంటరి తదితర శాఖలున్నాయి. ఆ శాఖలకు చెందిన ప్రజలని కలిసి వారి నుండి అవసరమయిన వివరాలు సేకరించి దాని ఆధారంగా నివేదిక తయారు చేస్తుంది. మంజునాధ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకొంటుంది.
కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ, వైకాపాలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి కనుక వారిని తమ వైపు తిప్పుకొనేందుకు తెదేపా ప్రభుత్వం హడావుడిగా ఈ మంజునాధ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పవచ్చును. కనుక కాపులను బీసీలలో చేర్చడానికే లాంచనప్రాయంగా మంజునాద్ కమిటీ పర్యటన, అధ్యయనం, నివేదిక వగైరా నిర్వహిస్తోందని భావించవచ్చును.