హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడున్న 50శాతం రిజర్వేషన్ పరిమితి దాటాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే సుప్రీమ్ కోర్ట్‌ను ఒప్పించి 50 శాతానికి పైన రిజర్వేషన్ పొందొచ్చని కాపులకు రిజర్వేషన్ కల్పించటంపై ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ చెప్పారు. ఆయన ఇవాళ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వగూడదని సుప్రీమ్ కోర్ట్ చెప్పలేదని అన్నారు. తనను నియమించింది కాపు కమిషన్ ఛైర్మన్‌గా కాదని, బీసీ కమిషన్ ఛైర్మన్గానని తెలిపారు. ఇంకా సభ్యుల నియామకం జరగాల్సి ఉందని చెప్పారు. 13 జిల్లాల్లో పర్యటిస్తానని, కాపుల గణాంకాలు సేకరించి వీలైనంత త్వరలో నివేదిక ఇస్తామని అన్నారు. మిగిలిన బీసీల అభ్యంతరాలను, కాపుల సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేస్తామని చెప్పారు.
మరోవైపు ముద్రగడ ఇవాళ కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ, కమిషన్ కాలపరిమితిని కుదించాలని డిమాండ్ చేశారు. కాపులకు ఇస్తామన్న రెండువేల కోట్లను రిలీజ్ చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు వస్తే మాట్లాడతానని చెప్పారు. ఇంతవరకు ఎవరూ రాలేదని తెలిపారు. తాను, తన శ్రీమతి రేపు ఉదయం 9 గంటలకు నిరాహారదీక్షలో కూర్చుంటామని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు సాధించటమే తన జీవిత లక్ష్యమని అన్నారు.