తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వివాదానికి పరిష్కారం ఏమిటి..? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మొత్తం సమస్య పరిష్కారం అవుతుదని.. షర్మిల దగ్గర్నుంచి సామాన్యుడి వరకూ చెబుతున్నారు. ఎందుకు మాట్లాడుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా అదే చెబుతున్నారు. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణ సర్కార్ తమ హక్కులను కాల రాస్తోందంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ చేపట్టడంతో ఆసక్తి రేకెత్తించింది.
గంట పాటు ఇరు వర్గాల వాదనలను సీజేఐ ధర్మాసనం విన్నది. కృష్ణాబోర్డును నోటిఫై చేసినందున విచారణ అవసరం లేదని తెలంగాణ సర్కార్ వాదించింది. అయితే..గెజిట్ ఇప్పుడే అమల్లోకి రాదని… సెప్టెంబర్ తర్వాత వస్తుందని.. ఇప్పటి నుంచే అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని.. అలాగే గతంలో కృష్ణా జలాల వివాదంలో వాదించానని గుర్తు చేసుకున్నారు. బుధవారం మరో ధర్మాసనం ముందుకు విచారణకు వస్తుందన్నారు. చివరికి రెండు రాష్ట్రాల న్యాయవాదులకు మధ్యవర్తిత్వ సూచన చేశారు.
ఎన్వీ రమణ.. వివాదాలను.. కేసులను ఎక్కువగా … వారికి వారే చర్చల ద్వారా లేదా.. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచనలు ఇస్తూంటారు. ఇలా కొన్ని కేసులు పరిష్కరిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించి సున్నితమైన అంశం కావడం.. అదీ కూడా ఆయన ఏపీకి చెందిన వారు కావడంతో విచారణపై ఉత్కంఠ ఏర్పడింది. ఆయన మధ్యవర్తిత్వ సలహా తెలుగు రాష్ట్రాలు పాటిస్తాయో లేదో కానీ.. సమస్య అయితే సుప్రీంకోర్టు కూడా పరిష్కరించలేదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో ఉంది.