భారత అత్యున్నత న్యాయస్థానానికి మరో తెలుగు వ్యక్తి చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. జస్టిస్ నూతలపాటి వెంకట రమణను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే కేంద్రానికి సిఫార్సులు పంపించారు. ప్రక్రియ ప్రకారం.. కేంద్రం ఈ నివేదిక పంపాలని కొద్ది రోజుల కిందట.. చీఫ్ జస్టిస్ను కోరింది. సంప్రదాయంగా.. చీఫ్ జస్టిస్ కూడా.. సీనియార్టీలో తన తర్వాత ఉన్న ఎన్వీ రమణ పేరును సూచిస్తూ.. కేంద్రానికి సిఫార్సు చేశారు.
సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమే. కేంద్రం అధికారికంగా నోటిఫై చేయడమే మిగిలి ఉంది. జస్టిస్ బోబ్డే సిఫార్సును కేంద్ర న్యాయశాఖ.. హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ బోబ్డే వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు ఇరవై ఆరో తేదీ వరకూ పదవిలో ఉంటారు.
ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచే అనేక కుట్రలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. మరో హైకోర్టు మాజీ న్యాయమూర్తి వివిధ పద్దతుల్లో ఎన్వీ రమణపై వివిధ రకాల అభియోగాలు మోపేందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే… జస్టిస్ ఎన్వీ రమణపై అనేక రకాల అభియోగాలు పేర్కొంటూ… చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు లేఖ రాశారు. దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు. ఇదంతా ఆయన చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు చేశారన్న విమర్శలు వచ్చాయి. అయితే ఎన్వీ రమణను అలాంటివీ చీఫ్ జస్టిస్ కాకుండా ఆపలేకపోతున్నాయి.