భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో అతి నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు ప్రధాని మోదీ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. మరికొద్ది మంది ముఖ్యులైన అతిధుల సమక్షంలో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింత్… జస్టిస్ ఎన్వి రమణతో ప్రమాణం చేయించారు. నిన్నటితో ఎస్ఏ బోబ్డే పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఎన్వి రమణను చీఫ్ జస్టిస్‌గా ఖరారు చేస్తూ.. రాష్ట్రపతి కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ ఎన్వి రమణ మారుమూల గ్రామంలో రైతు ఇంట పుట్టి.. దేశ అత్యున్నత న్యాయపీఠానికి అధిపతిగా ఎదిగారు. వీధి బడిలో .. తెలుగుమీడియంలో చదువుకుని న్యాయశాస్త్రాన్ని ఔపాసన పట్టారు. ఎన్నో ప్రశంసాపూర్వకమైన తీర్పులు ఇచ్చారు. 1983లో తొలి సారిగా న్యాయవాదిగా ప్రాక్టిస్ ప్రారంభించారు. 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.
జస్టిస్ ఎన్వి రమణ వచ్చేఏడాది ఆగస్టు 26 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఆ తరవాత రిటైరవుతారు.సీజేఐగా నియమితులయ్యే రెండో తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ. జస్టిస్ కోకా సుబ్బారావు 1966-1967 మధ్య కాలంలో సీజేఐగా వ్యవహరించారు. ఆ తర్వాత మరో తెలుగు న్యాయనిపుణుడు సీజేఐ స్థాయికి వెళ్లలేదు. ఆ ఘనత ఎన్వీ రమణ సొంతం. ఎన్వీ రమణకు తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.