తెలంగాణా న్యాయవాదుల ఉద్యమం కారణంగా రాష్ట్రంలో న్యాయవ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. రాష్ట్ర న్యాయవ్యవస్థలో తెలంగాణా న్యాయాధికారుల, ఉద్యోగులని కాదని ఆంధ్రా మూలాలు ఉన్నవారిని నియమించడం, హైకోర్టు విభజన అనే రెండు సమస్యలపై వారు ఉద్యమిస్తున్నారు. ఈ సమస్య ఇంత తీవ్రం అవడానికి ఏ ఒక్కరినో బాధ్యులని చెప్పడం సాధ్యం కాదు కానీ అందరూ మీరే బాధ్యులు అంటే కాదు మీరే బాధ్యులని వాదించుకొంటున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర కుమార్ ఒక టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ సమస్యపై చాలా చక్కగా విశ్లేషించి తగిన పరిష్కార మార్గం కూడా సూచించారు.
“ఈ సమస్యకి మూల కారణం విభజన చట్టంలో సెక్షన్:30 లో హైకోర్టు విభజనపై పూర్తి స్పష్టత ఇవ్వకపోవడమే. ఆ చట్టం తయారు చేస్తున్నప్పుడు, తెలంగాణాకి చెందిన న్యాయకోవిదులు, రాజకీయ నాయకులు చొరవ చూపకపోవడం చేతనే ఈ సమస్య ఉత్పన్నం అయ్యిందని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రాష్ట్రంలో ఎక్కడైనా హైకోర్టు ఏర్పాటు చేసుకోనేవరకు ప్రస్తుతం ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని సెక్షన్: 30లో ఉంది. తెలంగాణాకే ఆ అవకాశం కల్పించే విధంగా చట్టంలో వ్రాయించుకొని ఉండి ఉంటే నేడు హైదరాబాద్ లోనే వేరే చోట కానీ లేదా అదే భవన సముదాయంలో గానీ తెలంగాణా హైకోర్టు ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉండేది. అప్పుడు మనవాళ్ళు చొరవ చూపకపోవడం వలననే హైకోర్టు తాళం చెవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతికి ఇచ్చినట్లయింది. దానికేమీ తొందర లేదు కనుక అదేమీ హైకోర్టు విభజనకి ఒత్తిడి చేయదు. కనుక ఈ సమస్యని తెలంగాణా ప్రభుత్వమే పరిష్కరించుకోవలసి ఉంటుంది.”
“హైకోర్టు విభజనకి అవరోధంగా ఉన్న ఆ సెక్షన్:30 చట్టానికి సవరణ చేయమని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రప్రభుత్వాన్ని కోరవలసిఉంది. అందుకోసం శాసనసభలో ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపినట్లయితే, అప్పుడు బంతి కేంద్రప్రభుత్వం కోర్టులో వేసినట్లు అవుతుంది. అప్పుడు దానిపై గట్టిగా ఒత్తిడి చేయవచ్చు. తెలంగాణా ప్రభుత్వం ముందుగా తను చేయవలసిన ఈ పనిని చేసి తరువాతనే కేంద్రప్రభుత్వాన్ని వేలెత్తి చూపగలుగుతుంది. అప్పుడు కేంద్రం చట్ట సవరణ చేస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తుందా? అనేది దాని సమస్యే తప్ప మనది కాదు. అలాగ చేయకుండా ధర్నాలు, మీడియా ప్రకటనలు ఎన్ని చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం చేయవలసిన ఈ పనిని చేయకుండా కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చొంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కూడా కాదు,” అని చెప్పారు.
ఇక న్యాయాధికారుల నియామకాలపై అడిగిన ప్రశ్నలకి జవాబిస్తూ, “చట్ట ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయమూర్తులని, ఉద్యోగులని నియమించే హక్కు ఉంది. కొత్తగా నియామకాలు చేస్తున్నప్పుడు వారిని అన్ని విధాల పరీక్షించి, ఉతీర్ణులైన అభ్యర్ధుల జాబితాని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే అది పరిశీలించి ఆమోదం తెలుపుతుంటుంది. ఒకవేళ దానిలో ఎవరిపైనైనా అది అభ్యంతరాలు ఉన్నట్లయితే పునః పరిశీలించమని ప్రధాన న్యాయమూర్తిని కోరవచ్చు. ఆయన ప్రభుత్వ అభ్యర్ధనని అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అంతిమ నిర్ణయం తీసుకొనే హక్కు ఆయనకే ఉంది.”
“ఇక ఉద్యోగులకి, న్యాయాధికారులకి ఆప్షన్స్ ఇచ్చే విధానం చాలా కాలంగా అమలులో ఉంది. రాష్ట్రాలు విడిపోయిన తరువాత కూడా దానినే అమలు చేయడం వలననే ఈ సమస్యలు వచ్చినట్లు కనిపిస్తోంది. కనుక దానిపై అభ్యంతరాలున్నట్లయితే అదే విషయాన్ని ఒక పిల్ ద్వారా హైకోర్టుని అభ్యర్ధించవచ్చు. ప్రాధమిక కేటాయింపుల విషయంలో రెండు విధాలుగా నిర్ణయాలు తీసుకొంటారు. ఒకటి పాలనపరంగా రెండవది చట్టపరంగా. మొదటిదాని ప్రకారం తీసుకొని ఉన్నట్లయితే దానిని కోర్టులో సవాలు చేయవచ్చు. చట్ట ప్రకారం తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేయలేరు,” అని జస్టిస్ రవీంద్ర కుమార్ చెప్పారు.