సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నిన్న పదవీ విరమణ చేసారు. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు 43 వ ప్రధాన న్యాయమూర్తిగా తీర్థ్ సింగ్ ఠాకూర్ (63) చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్లో బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడి, కేంద్రమంత్రులు, మాజీ ప్రధాన న్యాయమూర్తి, మరి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ జనవరి 3, 2017 వరకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు.
జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జన్మించారు. 1972వ సం.లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, పన్నులు, సర్వీసులలో ఆయనకి మంచి అనుభవం ఉంది. 1990 వ సం.లో ఆయనను సీనియర్ అడ్వొకేట్ గా నియమితులయ్యారు. 1994 వ సం.లో ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. అదే సం.లో కర్నాటక హైకోర్టుకి బదిలీ అయ్యారు. 2004 వ సం.లో డిల్లీ హైకోర్టుకి బదిలీ అయ్యారు. 2008 వ సం.లో ఆయన డిల్లీ హైకోర్టులో ఏక్టింగ్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించారు. మళ్ళీ అదే సం.లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి మీద బదిలీ అయ్యారు. 2009 వ సం. నుండి సుప్రీం కోర్టు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు స్వీకరించారు.