నిన్ననే రాజ్యసభ బాల నేరస్తుల చట్టం ఆమోదించింది. రాష్ట్రపతి దానిపై సంతకం చేసిన తరువాత ఆ చట్టం అమలులోకి వస్తుంది. ఆ చట్టంలో బాల నేరస్తుల వయసును 18 నుండి 16 సం.లకి తగ్గించబడింది. ఇకపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన 16 సం.ల వయసున్న బాలనేరస్థులను కూడా పెద్దవారితో సమానంగా పరిగణించి కోర్టులు శిక్షలు ఖరారు చేస్తాయి. ఈ చట్టం ఇంకా అమలులోకి రాకముందే తమిళనాడులో 16 ఏళ్ల వయసున్న ఒక పిల్లవాడు సామూహిక అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు.
ఈనెల 11వ తేదీన చెన్నైకి సమీపంలో మధురాంతకం అనే ఊరులో 21 ఏళ్ళు వయసున్న ఒక మహిళ తన పశువులను మేపుకొంటుంటే నాగరాజ్ (26), కమల్ (25) అనే ఇద్దరు దినసరి కూలీలు ఆమెను సమీపంలోని పొదలచాటుకు లాక్కొనివెళ్లి ఆమెపై అత్యాచారం చేసారు. వారితో బాటు ఆ 16సం.ల వయసున్న పిల్లాడు కూడా ఆమెపై అత్యాచారం చేసాడు. తరువాత ఆమెను సమీపంలో ఒక చెరువు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు. ఆమె స్పృహలోకి వచ్చిన తరువాత ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలియజేయడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె తెలిపిన ఆధారాలతో ముగ్గురు నిందితులను పట్టుకొన్నారు. వారి ముగ్గురిపై సెక్షన్స్: 342, 307, 376 క్రింద పోలీసులు కేసులు నమోదు చేసారు. చెంగల్ పట్ మేజిస్ట్రేట్ కోర్టు నాగరాజ్, కమల్ జైలుకి పంపింది. బాలనేరస్తుడిని కెళ్ళి అనే ప్రాంతంలో గల బాలనేరస్థుల బోర్డుకు పంపింది. వారు అతనిని బాల నేరస్తుల గృహానికి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్నందున నిన్న రాజ్యసభ ఆమోదించిన బాల నేరస్తుల చట్టం అమలులోకి రాగానే ఇతనికి వర్తింపజేయబడుతుంది.