వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకొంటోందని శాసనసభలో జగన్ ఆరోపించినపుడు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ ఆరోపణలని ఖండిస్తూ “అసలు మీ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వెళ్లిపోవాలనుకొంటున్నారు…కారణాలు ఏమిటి?అనే విషయం తెలుసుకోండి. మీ వైఖరితో విసిగెత్తిపోయే మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు. పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న మాకు మీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి చేర్పించుకోవలసిన అవసరం మాకు లేదు,” అని చెప్పారు.
వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా ప్రలోభ పెడుతోందా లేదా అనే విషయం పక్కనబెడితే, యనమల చెప్పిన దాంట్లో జగన్ తీరు పట్ల వైకాపా నేతల్లో అసంతృప్తి నెలకొని ఉందనే మాట వాస్తవం. త్వరలో తెదేపాలో చేరబోతున్న వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన తాజా వ్యాఖ్యలు వింటే ఆ సంగతి అర్ధమవుతుంది.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “నాకు జగన్ మీద అసంతృప్తి లేదు కానీ ఆయన పార్టీని నడిపిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీలో జరుగుతున్నది ఒకటి..ప్రజలు ఆశిస్తున్నది వేరొకటిగా ఉన్నాయి. అసలు ప్రజాభీష్టానికి అనుగుణంగా పార్టీ నిర్మించబడలేదు. కనుక ఇప్పటికయినా పార్టీ నాయకత్వం (జగన్మోహన్ రెడ్డి) పార్టీ అనుసరిస్తున్న విధానాలను, పార్టీలో పరిణామాల గురించి ఆత్మవిమర్శ చేసుకొంటే మంచిది. నాకు శాసనసభ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వలేదనే కోపంతో అలిగి పార్టీ వీడుతున్నాననే ఆరోపణ వాస్తవం కాదు. నేను పదవుల కోసం ఏనాడూ ఆరాటపడలేదు. వాటంతట అవే నాకు దక్కుతుండేవి. కనుక పదవులు అధికారం లేదా వేరే దేనికో ఆశపడి వైకాపాని వీడి తెదేపాలో చేరుతున్నానని వస్తున్న ఆరోపణలలో నిజం లేదు,” అని జ్యోతుల నెహ్రూ చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి శాసనసభ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని బి రాజేంద్రనాథ్ కి కట్టబెట్టిన తరువాతనే జ్యోతుల నెహ్రూ పార్టీ వీడుతున్నారు కనుక అయనకి పదవులపై ఆశలేదనుకోలేము. ఆ పదవి దక్కలేదనే కారణంగానే ఆయన పార్టీ వీడుతున్నారనే భావించవలసి ఉంటుంది. కానీ పార్టీ అధినేతని నేరుగా విమర్శించకపోయినా పార్టీ విధానాలను విమర్శిస్తున్నారంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డినే వేలెత్తి చూపుతున్నారని స్పష్టం అవుతోంది. పార్టీని వీడి బయటకు వెళ్లిపోయేవారిలో చాలా మంది ఇదే పిర్యాదు చాలా కాలంగా చేస్తుండటం గమనిస్తే వారు చేస్తున్న ఆ ఆరోపణలలో ఎంతో కొంత నిజముందని అర్ధమవుతోంది.
ఇటీవల నెల్లూరులో జరిగిన ఒక బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “నేను పైనున్న ఆ దేవుడిని, ప్రజలని మాత్రమే నమ్ముకొన్నాను తప్ప నాయకులని కాదు. అందుకే ఎన్ని ఒడిడుకులు ఎదురవుతున్నా పార్టీ ముందుకు సాగుతోంది,” అని అన్నారు.
తెలంగాణాలో తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోతున్నప్పుడు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా అచ్చం జగన్ లాగే అంటుంటారు. ఒక్కడు పోతే వంద మంది నాయకులని తయారు చేసుకొంటామని చెపుతుంటారు. కానీ ఆయన మాటలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు ఉంటాయి. ఆయన తన అసహాయతని కప్పి పుచ్చుకోవడానికే ఆవిధంగా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనబడుటుంది కానీ జగన్ మాటలలో ఆయన తన పార్టీలో నేతలను ఖాతరు చేయరనే భావం కనబడుతుంది.
చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒకే మాట చెపుతున్నా వారి మాటలలో ఎందుకు వ్యత్యాసం కనబడుతోంది అంటే దానికీ జగన్ మాటలనే మళ్ళీ చెప్పుకోవలసి ఉంటుంది. నెల్లూరు సభలోనే ఆయన మాట్లాడుతూ “నేను, మా అమ్మ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకి వచ్చేసినప్పుడు నుదుటున అరచెయ్యి అడ్డుపెట్టుకొని తేరిపార చూస్తే రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు కనబడ్డాయి కానీ రాష్ట్రంలో ఒక్కడూ సమర్దుడయిన నాయకుడు కనబడలేదు. మళ్ళీ తేరిపార చూస్తే నేను, మా అమ్మే కనబడ్డాము,” అని అన్నారు. జగన్ ప్రదర్శిస్తున్న ఆ అతిశయం గమనిస్తే రాష్ట్రంలోనే తనంతట గొప్ప రాజకీయ నేత లేదని చాలా బలంగా నమ్ముతున్నట్లు స్పష్టం అవుతోంది.
మరి అటువంటి వ్యక్తి కళ్ళకి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కనిపిస్తారా? కనిపించినా వారిని ఆయన ఖాతరు చేస్తారా? అని ఆలోచిస్తే జ్యోతుల నెహ్రూతో సహా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న వారు జగన్ గురించి చెపుతున్న మాటలలో వాస్తవం ఉందనే సంగతి అర్ధమవుతోంది. ఇంత మంది హెచ్చరిస్తున్న జగన్ తన తీరు మార్చుకోకపోతే చివరికి ఆయనే కాదు ఆయనని నమ్ముకొన్నవారు కూడా నష్టపోతారు. అటువంటి ప్రమాదమే ఉందని అనుమానం వస్తే అందరూ పార్టీని వదిలి పారిపోవడం తధ్యం అని చెప్పవచ్చును.