రాజకీయ నేతలు ఒక పార్టీలో ఉన్నప్పుడు తమ అధినేత అంత గొప్పవాడు మరెవరూ ఉండబోరని తెగ పొగుడుతుంటారు. కానీ పార్టీ మారగానే అధినేత గురించి తమ మనసులో అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టేస్తారు. అలాగే అంతవరకు సదరు నేతతో భుజాలు రాసుకొని తిరిగిన పార్టీలో నేతలు పార్టీకి పట్టిన శని, చీడ వదిలింపోయిందని మెటికలు విరుస్తుంటారు. అంటే అంతకాలం పార్టీలో అందరూ ఒకరినొకరు అయిష్టంగానే భరించారనుకోవాలి. ఇటువంటివన్నీ మన రాజకీయాలలో చాలా సహజమే అయినప్పటికీ వాటి వలన, ఆ రాజకీయ పార్టీల నేతల, అధినేతల బలహీనతలను ప్రజలు కూడా తెలుసుకొనే భాగ్యం దక్కుతోంది. ప్రస్తుతం వైకాపా నుంచి చాలా మంది తెదేపాలోకి జంప్ అయిపోతున్నారు కనుక వాళ్ళు పోతూపోతూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను విని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
చంద్రబాబు నాయుడు సమక్షంలో నిన్న తెదేపాలో చేరిన జ్యోతుల నెహ్రూ జగన్ గురించి చెప్పిన మాటలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. జగన్ గురించి ఆయన ఏమన్నారంటే “పార్టీలో తను తప్ప తక్కినవాళ్లు అందరూ వట్టి జీరోలనుకొంటారు జగన్. అందుకే ఆయన ఎవరి మాటను వినరు. ఎవరి సలహాలు స్వీకరించడానికి ఇష్టపడరు. పార్టీ సమావేశంలో కానీ, శాసనసభలో గానీ నావంటివారు ఎప్పుడయినా ధైర్యం చేసి ఏదయినా చెప్పబోయినా జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకొనేవారే కాదు. అటువంటి వ్యక్తితో ఎంత కష్టపడి పనిచేసినా అటు పార్టీకి కానీ, పనిచేసిన వ్యక్తికి గానీ ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల అభిప్రాయాలకి అద్దం పట్టాలి. దానికి సమాజాన్ని, ప్రజాభిప్రాయాన్ని అర్ధం చేసుకొనే శక్తి కలిగి ఉండాలి. కానీ వైకాపాలో కేవలం జగన్ అభిప్రాయాలకు, నిర్ణయాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కనుక అక్కడ సమిష్టి ఆలోచనలకు, నిర్ణయాలకు అవకాశమే లేదు. అటువంటి పార్టీ ఎన్నటికీ రాజకీయ పరిణతి చెందదు,” అని చెప్పారు.
గత రెండేళ్ళుగా వైకాపాని వీడిన వారిలో చాలా మంది నేతలు జగన్ గురించి ఇదే రకమయిన పిర్యాదు చేస్తుండటం గమనిస్తే, నేటికీ ఆయన తీరు మారలేదని అర్ధమవుతోంది. తన తీరు వలననే పార్టీకి చాలా నష్టం జరుగుతోందని జగన్ గ్రహించి, ఆ తప్పుని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఎదగడానికి ఇటువంటిది కూడా ఒక సమస్యగా మారడం నిజంగా విచిత్రమేననుకోవాలి.
“కనీసం నేను బయటకి వచ్చేసిన తరువాత అయినా జగన్ తన తీరు మార్చుకొంటారని ఆశిస్తున్నానని” జ్యోతుల నెహ్రూ అన్నారంటే ఆయన జగన్ వైఖరితో ఎంత విసుగెత్తిపోయున్నారో అర్ధం చేసుకోవచ్చును. ఆయన పార్టీ విడిచిపెట్టి బయటకి వెళ్లిపోయారు గాబట్టి ఆవిధంగా మాట్లాడుతున్నారని భావించకుండా, ఆయన చెపుతున్న ఆ లోపాలను సవరించుకొనే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇటువంటి విమర్శలు, పరిస్థితి ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.