వైకాపా సీనియర్ నేత, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఇవ్వాళ్ళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నారు. అందుకోసం ఆయన విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. వంద కార్లు, అనేక వందల మోటార్ సైకిల్స్ పై తన అనుచరులతో కలిసి భారీ ఊరేగింపుగా సభకి రాబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ బలప్రదర్శనగానే చూడవచ్చును. దానితో వేరే పార్టీలపై ఎటువంటి ప్రభావం చూపదు కనుక అది తెదేపా నేతలకోసం ఉద్దేశ్యించిన బలప్రదర్శనగానే భావించవలసి ఉంటుంది. మరి దీనిని తెదేపా నేతలు ఏవిధంగా స్వీకరిస్తారో చూడాలి.
ఆయన పార్టీలో చేరడం వలన తెదేపా మరింత బలపడవచ్చును కానీ వారి చేరికతో ‘మంది ఎక్కువయితే మజ్జిగ పలుచబడుతుంది’ అన్నట్లుగా పార్టీలో పరిస్థితులు తయారయినా ఆశ్చర్యం లేదు. తెదేపా నేతలకు దక్కవలసిన గౌరవం, పదవులు, టికెట్లు వగైరా వాళ్ళు ఎగురేసుకుపోయే అవకాశాలున్నాయి. వైకాపా నుంచి వచ్చిన వారిలో భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ, జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రులలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగినట్లయితే తెదేపాలో మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారికి ఆగ్రహం, అసంతృప్తి కలగడం తధ్యం.
ఈ అసంతృప్తికి తోడూ వైకాపా నుంచి వచ్చి తెదేపాలో చేరుతున్న నేతలతో తెదేపాలో ఉన్న నేతలకి గొడవలు మొదలయ్యాయి. వైకాపా నుంచి వచ్చి చేరిన ఆదినారాయణ రెడ్డితో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డితో శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే యుద్ధం ప్రారంభించేసారు. ఇప్పుడు జ్యోతుల నెహ్రు బలప్రదర్శన చేస్తూ ఆ యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తున్నారు కనుక ఆయన కూడా తెదేపా నేతలకి సవాలు విసరవచ్చును.
వైకాపా ఎమ్మెల్యేల చేరిక వలన తెదేపాలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉంటే, వరుసగా ముఖ్య నేతలు అందరూ తెదేపాలోకి వెళ్లిపోతుండటం వలన వైకాపాలో తీవ్ర నిరాశ నిస్పృహలు కమ్ముకొంటున్నాయి. వాటిని తొలగించి మళ్ళీ పార్టీ నేతలు, కార్యకర్తలలో నూతన సమరోత్సాహం కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు విడిచిపోకుండా అందరినీ స్వయంగా లేదా పార్టీలో సీనియర్ నేతల చేత బుజ్జగిస్తున్నారు. అయినా పార్టీలో వలసలు ఆపలేకపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోవడం వలన పార్టీ బలహీనపడుతుంటే, పార్టీ వ్యూహకర్తలు తెదేపాలో చేరిపోతుండటం వలన పైకి కనబడని మరో రకమయిన నష్టం జరుగుతోంది.
ఆదినారాయణ రెడ్డి, భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్ వంటివారు వైకాపా బలహీనతలు, బలబలాలు పట్ల మంచి అవగాహన ఉన్నవారే. అటువంటి వారు శత్రుపక్షంలో చేరిపోవడంతో వైకాపాకు మున్ముందు చాలా నష్టం కలిగించవచ్చును. తెలంగాణాలో తెదేపా ఎమ్మెల్యేలతో బాటు పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు కూడా తెరాసలో చేరిపోతుండటం చేత అక్కడ తెదేపా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. కనుక జగన్మోహన్ రెడ్డి తక్షణమే మంచి ప్రతి వ్యూహం రచించి అమలుచేయలేకపోతే ఏపిలో కూడా వైకాపాకు అటువంటి పరిస్థితే ఎదురయినా ఆశ్చర్యం లేదు.