హైదరాబాద్ నగరం అభివృద్ధితో తన వంతు పాత్ర చాలా ఉందన్నారు కె.ఎ.పాల్. భాగ్యనగరాన్ని తాను అభివృద్ధి చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారనీ… ఆయన సీఎం కాకముందే నగరం అభివృద్ధి జరిగిందనీ, దాన్లో తన కృషి కూడా ఉందని చెప్పుకున్నారు. ఇటీవలే ఆయన ఓ ఛానెల్ లో మాట్లాడుతూ… బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలీదనీ, యాక్టర్ అని మాత్రమే తెలుసనీ, అంతకుమించి ఆయన గురించి ఏమీ తెలీదని మాట్లాడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిపై కూడా పాల్ స్పందించారు.
బాలకృష్ణ ఎవరో తనకు తెలీదని ఒక వీడియోలో తాను చెబితే, దాన్ని 14 లక్షలమంది చూశారనీ, తనకు ఉన్న ఫాలోయింగ్ స్థాయి ఏంటో చెప్పడానికి ఇదొక్కటీ చాలని గొప్పగా చెప్పుకున్నారు. తాను ఆంధ్రాలో ఉన్నది తక్కువ అనీ, విదేశాల్లోనే ఎక్కువగా ఉంటాను అన్నారు. తాను ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానెల్లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, పవన్ ఇంటర్వ్యూని కేవలం ఐదు నుంచి పదివేలమంది మాత్రమే చూశారని కె.ఎ.పాల్ చెప్పారు. అంటే, వాళ్లకంటే తనకు వందల రెట్లు ఫాలోయింగ్ ఉందనీ, పవన్ మాట్లాడితే చూసిన పదివేల మంది ఎక్కడా, తాను మాట్లాడితే చూసిన 14 లక్షల మంది ఎక్కడా అని చెప్పుకున్నారు పాల్. పాపులారిటీ విషయంలో పవన్ కల్యాణ్ కంటే తానే ఎక్కువ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
వాస్తవం మాట్లాడుకుంటే… కె.ఎ.పాల్ ఈ మధ్య తరచూ ఏదో ఒక చోట మాట్లాడుతున్నారు. రాజకీయాల గురించి కూడా తన అభిప్రాయాలు చెప్తున్నారు. అలాంటి వీడియోలకి రాని పాపులారిటీ… ఈ ఒక్క వీడియోకే ఎందుకు వచ్చింది..? ప్రముఖ నటుడు బాలకృష్ణ ఎవరో తెలీదని కె.ఎ.పాల్ చెప్పేసరికి అది పాపులర్ అయింది. బాలయ్య ఎవరో తెలీదు అనడమే.. ఆ వీడియోకి సోషల్ మీడియాలో ప్రాధాన్యత తెచ్చిన అంశం. ఒకవేళ పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలీదని చెప్పినా కూడా… అదే రేంజిలో ఆ వీడియో పాపులర్ అవుతుంది. ఇదిగో ఇప్పుడు… పవన్ కంటే తనకే పాపులారిటీ ఎక్కువ అన్నారు కదా. ఇది కూడా లక్షల వ్యూస్ తెచ్చిపెట్టే కామెంటే. ఆయన వ్యాఖ్యానించిన వ్యక్తులకు ఉన్న పాపులారిటీ వల్ల వచ్చిన వ్యూస్.. అంతేగానీ, తాను వ్యాఖ్యానించడం వల్ల మాత్రమే వచ్చినవి అని పాల్ అనుకుంటే ఎలా..? ఆ లెక్కన పాల్ కనిపించిన ప్రతీ వీడియో ట్రెండింగ్ లో ఉండాలి కదా!