సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధాన కారణాల్లో సాగునీటి సమస్య ఒకటి. ఈ విషయంలో అన్యాయం జరుగుతోందనే ఆందోళనతో రైతులు దశాబ్దాల పాటు పోరుబాట పట్టారని తెరాస నేతలు గుర్తు చేస్తున్నారు. ఇంత కాలానికి సొంత రాష్ట్రానికి వస్తే, తమకు కేటాయించిన వాటా ప్రకారం నీటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకోవద్దా అనేది కేసీఆర్ సర్కార్ ప్రశ్న.
ఏపీలో చంద్రబాబుపై అనేక ఒత్తిళ్లున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శలు, నిరాహార దీక్షతో బాబుపై ఒత్తిడి పెరిగింది.
అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య వివాదాలు వద్దని, అపార్థాలను తొలగించుకోవడానికి చర్చించుకోవడం మేలని చంద్రబాబుకు కేసీఆర్ ప్రతిపాదన చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు ఏపీ ప్రయోజనం భంగకరం కాదనే వాదన తాను వినిపించడం, ఏపీకి ఏ విధంగా నష్టమో చంద్రబాబు చెప్తే వినడం, అంతిమంగా అపార్థాలు తొలగేలా ఓ నిర్ణయానికి రావడం కేసీఆర్ ప్రతిపాదన ఉద్దేశం.
సాధారణంగా ఏ సమస్యకైనా సామరస్య పరిష్కారం కోసం ప్రయత్నించడం చంద్రబాబు అలవాటు. ప్రతిదానికీ గొడవ పడే కంటే పెద్దమనిషి తరహాలో చర్చించడమే మంచిదని ఆయన భావిస్తారు. అయితే ఈసారి మాత్రం కేసీఆర్ తో చర్చలకు చంద్రబాబు విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే తేల్చుకోవాలనేది ఆయన నిర్ణయమని సమాచారం.
మరోవైపు, తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. ఏపీ వైఖరిపై ఏఖంగా కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడింది. మంత్రి హరీష్ రావు శనివారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ఉమాభారతితో పాటు అవసరమైతే మరికొందరిని కలవడానికి సిద్ధమయ్యారు. ఏపీ వైఖరిని ఆమెకు సవివరంగా చెప్పడానికి సంసిద్ధమయ్యారు. అయితే అనుకోకుండా ఆయన పర్యటన వాయిదా పడింది. శనివారం తమ శాఖ ఉన్నతాధికారులు అందుబాటులో లేరు కాబట్టి సోమవారం రావాలంటూ హరీష్ రావుకు ఉమాభారతి ఫోన్ చేసి చెప్పారు.
తమకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన ప్రకారమే నీటిని వాడుకుంటామని కేసీఆర్ మొదటినుంచీ చెప్తున్నారు. దిగువ రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ప్రవర్తించబోమంటున్నారు. అయితే ఏపీ నేతలకు అనుమానాలున్నాయి. ఒక్కసారి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఇక ఏటా సమస్యలు రావచ్చనేది వారి భయం. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ వైఖరి అది కాదని పదే పదే చెప్తోంది. జగన్ పెడుతున్న ఒత్తిడి వల్ల చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం ఆపలేదు. కేంద్రానికి ఫిర్యాదు మాత్రం చేయగలదు.
ఏపీ వాదనలో వాస్తవం ఉందని కేంద్రం భావిస్తే ఆ మేరకు ఏమైనా ఆదేశాలు ఇవ్వవచ్చు. ఒకవేళ తెలంగాణ వాదనలో న్యాయం ఉందని భావిస్తే ఏపీకి నిరాశ తప్పదు. కాబట్టి కేంద్రం ఏం చేస్తుందనేది కీలకం. అయినా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకుని ఓ ఏకాభిప్రాయానికి రావడానికి ప్రయత్నిస్తే తప్పేమిటి?