భారతదేశం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది… త్వరలోనే అగ్రరాజ్యాల పక్కన నిలబడబోతోందంటూ ఒక పక్క ప్రభుత్వాలు జనాలను తెగతెంపులు ఊదరగొడుతుంటే, మరోపక్క నేటికీ దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కులాలవారిగా రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రజలకు మార్గదర్శనం రాజకీయ పార్టీలు, కొందరు నేతలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రజల మధ్య ఆ దూరాన్ని ఇంకా పెంచేప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఇటీవల ప్రముఖ విద్యావేత్త కంచె ఐలయ్య బ్రాహ్మణులను ఉద్దేశ్యించి వాళ్ళు సోమరిపోతులని, వారు ఏపని చేయడానికి ఇష్టపడరని చేసిన వ్యాఖ్యలు ఆ వర్గానికి చెందిన ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. వారి నుండి కొన్ని విమర్శలు ఎదుర్కొన్న తరువాత, తను ఆ ఉద్దేశ్యంతో మాట్లాడలేదని, తనకు వారిపట్ల గౌరవం ఉందని సర్ది చెప్పుకొన్నారు. కానీ ఆయన బ్రాహ్మణ విద్వేషం మళ్ళీ నిన్న మరొకమారు బయటపెట్టుకొన్నారు. వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఒక సెమినార్ లో మాట్లాడుతూ “బ్రాహ్మణులు సమాజానికి ఏమి చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు కేటాయించింది? బ్రాహ్మణుల ఆర్ధిక స్థితిగతుల గురించి ప్రభుత్వాలు నివేదికలు బయటపెడితే, వాస్తవాలు అందరికీ తెలుస్తాయి. ప్రజలందరూ తమ కులాన్ని, కులవృత్తిని సూచించే విధంగా పేరు చివర పెట్టుకోవాలి,” అని అన్నారు.
రెండు రాష్ట్రాలలో కూడా గొప్ప విద్యావేత్తగా మంచి గుర్తింపు, గౌరవం పొందుతున్న కంచె ఐలయ్యకి ఈ బ్రాహ్మణ విద్వేషం ఎందుకో తెలియదు కానీ ఆయన వంటి వ్యక్తి నోటి నుంచి రావలసిన మాటలివి కావని చెప్పక తప్పదు. ఆయన తన మేధసుతో సమాజానికి మార్గదర్శనం చేసి, అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యత పెంచకపోగా వారి మద్య విభేదాలు సృష్టిస్తూ, కులాలు, వృత్తులు సూచించే విధంగా పేర్లు పెట్టుకొని మళ్ళీ తిరోగమనదిశలో నడుచుకోమని సలహా చెప్పడం చాలా శోచనీయం. మన దేశంలో అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలలో దయనీయమైన జీవితాలు గడుపుతున్నవారు కోట్లాది మంది ఉన్నారు. ఆ కోట్లాదిమందిలో బ్రాహ్మణులు కూడా ఒకరు. ఆ కోట్లాది భారతీయులందరి సమిష్టి కృషి కారణంగానే దేశాభివృద్ధి జరుగుతోంది తప్ప ఏదో ఒక వర్గం వారి వలన కాదనే సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు కంచె ఐలయ్య ఒక వర్గం వారిని కించపరుస్తూ మాట్లాడటం సబబు కాదు. ఒకవేళ ఆయన చెపుతున్నట్లు ఒక వర్గం ప్రజలు పనిచేయకపోయినా దేశానికి నష్టం లేదు కానీ ఇటువంటి మాటల వలననే ఎక్కువ నష్టం జరుగుతుంది. మేధావులు తమ మేధసుని సమాజహితానికి, ప్రజల మద్య ఐక్యత సాధించి అభివృద్ధి పథంలో నడిపించెందుకే వినియోగిస్తే అందరూ హర్షిస్తారు.