కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి ఈరోజు శాసనసభలో చాలా ఆలోచించదగ్గ మాటలు చెప్పారు. బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే ఉండకూడదనే మీ ధోరణి సరికాదు. అది ప్రజాస్వామ్య విధానం కాదు. ప్రతిపక్ష పార్టీల నేతలని, ఎమ్మెల్యేలని మీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా మీరు ఇంకా బలపడి, ప్రతిపక్షాలను దెబ్బ తీయవచ్చునని మీరు భావిస్తున్నట్లయితే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఒకప్పుడు తమిళనాడు శాసనసభలో అన్నాడిఎంకె పార్టీ తరపున ఉన్న ఏకైక మహిళా సభ్యురాలు జయలలితను అధికారంలో ఉన్న డి.ఎం.కె.సభ్యులు సభలో అవమానపరిచి బయటకు వెళ్ళగొట్టారు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో అందుకు డి.ఎం.కె. పార్టీ మూల్యం చెల్లించుకొంది. ఆమె పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చేరు. ఒకప్పుడు భాజపాకి లోక్ సభలో రెండే రెండు స్థానాలుండేవి. అది కూడా పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం చూసాము. కనుక ఇప్పుడు అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ ఇష్టం వచ్చినట్లు చేస్తే తెరాసకు కూడా ప్రజలు గుణ పాఠం చెపుతారు,” అని అన్నారు.
“అధికారం శాశ్వితం కాదనే సంగతి తెరాస గ్రహిస్తే మంచింది. అలాగ కాదని ప్రజాస్వామ్య ముసుగులో ఈవిధంగా నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తే దానికి తెరాస కూడా తప్పకుండా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పుడు అందరూ ఒక నూతన శకం ఆరంభమయిందని చాలా సంతోషించారు కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. మేము తెరాస ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు మాత్రమే ఇస్స్తున్నాము తప్ప పొరుగునే కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీలా మేము వ్యవహరించడం లేదని గమనించాలి. ఆ శాసనసభలో నిత్యం కనిపిస్తున్న పరిస్థితులు మేము కూడా సృష్టించాలని ఎన్నడూ భావించలేదు. కనుక ఇప్పటికయినా తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల తన తీరు మార్చుకొంటే బాగుంటుంది,” అని జానారెడ్డి హితవు పలికారు.