ఓం నమో వేంకటేశాయనే కె.రాఘవేంద్రరావు చివరి సినిమా, ఈ సినిమా తరవాత ఆయన రిటైర్ అయిపోతారన్న సంగతి తెలుగు 360 ముందే చెప్పింది. ఇదే రాఘవేంద్రరావుగారి చివరి సినిమా కావొచ్చు… అంటూ స్వయంగా నాగార్జున కూడా ఓం నమో వేంకటేశాయ ఆడియో ఫంక్షన్లో అనుమానం వ్యక్తం చేశారు. దాంతో రాఘవేంద్రరావు రిటైర్మెంట్ అనే వార్తలకు బలం చేకూరినట్టైంది. దర్శకేంద్రుడి నోటి నుంచి రిటైర్మెంట్ ఆలోచన రాకపోయినా.. – మనసులో మాత్రం ఓం నమో వేంకటేశాయనతోనే స్వస్తి చెప్పాలని భావిస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓం నమో వేంకటేశాయ ఫలితం ఎలా ఉన్నా, ఇక మీదట సినిమాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అయితే.. కొంతమంది సన్నిహితులు మాత్రం మరో సినిమా తీయాలని, ఆ సినిమా తీస్తున్నప్పుడే ‘రాఘవేంద్రరావు ఆఖరి చిత్రం’ అనే ప్రచారం జోరుగా చేయాలని, అప్పుడు ఆ సినిమాపై అందరి ఫోకస్ పడుతుందని, స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా నటించడానికి ముందుకొస్తారని సలహాలు ఇస్తున్నారట.
ఇందుకు రాఘవేంద్రరావు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. బడా హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తీసిన రాఘవేంద్రరావు కెరీర్లో పెళ్లి సందడి లాంటి చిన్న సినిమాలూ ఉన్నాయి. అలాంటి ఓ చిన్న సినిమాని, భారీగా తెరకెక్కించి, అందులో తనదైన మార్క్ చూపించి, అప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలన్న ఆలోచనలో రాఘవేంద్రరావు వచ్చినట్టు తెలుస్తోంది. నమో వేంకటేశాయ విడుదలైన వెంటనే తన కొత్త సినిమా సంగతుల్ని పంచుకొనే అవకాశం ఉంది. సో.. రాఘవేంద్రరావు చివరి సినిమా ఇంకోటుందన్నమాట. మరో సినిమా తీసిన తరవాత దర్శకేంద్రుడు మెగాఫోన్కు దూరం అవుతారు. సో ఆ చివరి అద్భుతం కోసం ఎదురుచూద్దాం.