కె రాఘవేంద్రరావు ‘నేను సినిమాకి రాస్తున్న ప్రేమలేఖ’ పేరుతో ఒక పుస్తకం రాశారు. పుస్తకం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇన్ఫోసిస్ చైర్ పర్శన్ సుధాకృష్ణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించగా అల్లు అరవింద్, త్రివిక్రమ్, సుకుమార్.. ఇలా ఇండస్ట్రీ హేమాహేమీలు పుస్కకాన్ని అందుకున్నారు. రాఘవేంద్రరావు రాసిన ఈ పుస్తకం సహజంగానే ఆసక్తిని పెంచుతుంది. రాఘవేంద్రరావు మామూలు డైరెక్టర్ కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది సువర్ణాధ్యాయం. తెలుగు సినిమాని కోట్లకి పడగలెత్తించిన దర్శకుడు. మాస్ సినిమాకి మీనింగ్ చెప్పిన డైరెక్టర్.
ఎన్టీఆర్ , అక్కినేనితో మొదలుపెటితే.. అల్లు అర్జున్ దాక ఆయన ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్ళు. దాదాపు మూడు జనరేషన్స్ స్టార్స్ తో పని చేశారు. ఎన్టీఆర్ , ఎఎన్ఆర్ లకి ఎలాంటి హిట్స్ ఇచ్చారో.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లకి కూడా అదే స్థాయి హిట్లు ఇచ్చారు. ఎంతో మంది హీరోలని పరిచయం చేశారు. ఇక హీరోయిన్స్ ని చూపించడంలో కూడా ఆయనది ప్రత్యెకమైన శైలి. శ్రీదేవి, రమ్యకృష్ణ, జయసుధ, జయప్రధ.. ఒక్కరేమిటి.. చాలా మంది హీరోయిన్స్ ని గ్లామర్ క్వీన్స్ ని చేశారు. అలాగే హీరోయిన్స్ తో ఆయనకు మంచి అనుబంధం వుందని కూడా చెప్తారు.
అలాగే రాఘవేంద్రరావు కెరీర్ లో ఎత్తుపల్లాలు వున్నాయి. వరుస హిట్లు చూశారు.. వరుస ఫ్లాపులు కూడా చూశారు. కొన్ని సినిమాలు నిర్మించారు. పాత కొత్త తరాలకు వారధిగా వున్నారు. అలాంటి రాఘవేంద్రరావు రాసిన ఈ ప్రేమ లేఖలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహం సినిమాని అభిమానించే ప్రేక్షకుల్లో నెలకొంది.