హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అస్వస్థతకు గురయ్యారట. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆయన అల్లుడు – బాహుబలి నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ చెప్పారు. అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన రాఘవేంద్రరావు ఇప్పుడు డిశ్ఛార్జ్ అయ్యారని, కులాసాగా ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో చేరటంవలనే కొన్ని రోజులుగా మీడియాలో కనిపించటంలేదని శోభు తెలిపిన సమాచారంతో వెల్లడయ్యింది. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో పుణ్యస్నానమాచరిస్తున్నపుడు ఆయన ఇటీవలి కాలంలో ఆఖరుగా మీడియాలో కనిపించారు.బాహుబలి సమర్పకులు అయినప్పటికీ ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలోగానీ, విడుదల అయిన తర్వాతగానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన అమెరికాలో ఉన్నారనిమాత్రం రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.