దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్టుతో రావాలనుకున్నారు. ముగ్గురు కథానాయికలు, ముగ్గురు దర్శకులతో ఓ సినిమా చేద్దామన్నది ఆయన ప్లాన్. ఇవన్నీ గొలుసుకట్టు కథలు. మూడు కథలూ ఒకే చోట కలుస్తాయి. ఒక్కో కథలో ఒక్కో అగ్ర కథానాయిక. ఒక్కో కథనీ ఒక్కో దర్శకుడు తీస్తాడు. అలా ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమాని రూపొందించాలన్నది ప్లాన్. దిల్ రాజు భాగస్వామిగా చేరారు. ఓ దర్శకుడిగా క్రిష్ పేరు ఖాయమైంది. నక్కిన త్రినాథరావు కూడా రెడీ అయ్యారు. నాగశౌర్యని కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఆ తరవాత ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దాదాపుగా ఈ సినిమా ఆగిపోయినట్టే. ఎందుకంటే కథ ఎగ్జయిటింగ్ గా ఉన్నా – కార్యరూపం దాల్చడం కష్టమని రాఘవేంద్రరావు భావిస్తున్నార్ట. క్రిష్ .. పవన్ సినిమాతో బిజీ అవ్వడం వల్ల.. ఆయన చేతిలోంచి జారిపోయారు. రాఘవేంద్రరావు కోరుకున్న దర్శకులు, హీరోయిన్లు బిజీగా ఉన్నారు. దొరికిన వాళ్లతో సర్దుకుపోవడం రాఘవేంద్రరావుకి నచ్చడం లేదు.
పైగా గొలుసుకట్టు కథలనే ఫార్మెట్ మన దగ్గర పెద్దగా క్లిక్ అవ్వలేదు. బాలీవుడ్లో ఇలాంటి ప్రయోగాలకు కాసులు రాలలేదు. అక్కడ దస్ కహానియా అనే పేరుతో ఓసినిమా విడుదలైంది. పది మంది దిగ్గజ దర్శకులు పది కథల్ని షార్ట్ ఫిల్మ్స్‌గా తీశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ అధికంగా ఉన్న హిందీ సినిమానే క్లిక్ అవ్వకపోతే.. తెలుగులో పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. అందుకే… ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది.