హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఇటీవలే కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సీనియర్ నేత సాయన్న రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరగా, ఇవాళ మరో సీనియర్ నేత విజయరామారావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పార్టీ ఆఫీసుకు పంపారు. ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశముందని తెలుస్తోంది.
ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ సీబీఐకు డైరెక్టర్గా పనిచేసిన విజయరామారావు పదవీవిరమణ తర్వాత తెలుగుదేశంలో చేరారు. మంత్రిగా కూడా పనిచేశారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చాలారోజులు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించిన విజయరామారావును పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో సీబీఐ డైరెక్టర్గా నియమించారు(ఇద్దరిదీ కరీంనగర్ జిల్లాయే!). ఆ పదవిలో హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు, ముంబై పేలుళ్ళు మొదలైన కేసులలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. టీడీపీలో చేరిన తర్వాత మొట్టమొదటగా ఎమ్మెల్యే అయిన వెంటనే ఆర్ అండ్ బీ మంత్రి పదవి దక్కింది. విజయరామారావు తెలంగాణలో సంపన్న వెలమ భూస్వామి కుటుంబంనుంచి వచ్చారు. టీఆర్ఎస్లో చేరటానికి ఆ కుల సమీకరణాలు కూడా కారణమై ఉండొచ్చు. మొత్తానికి చంద్రబాబు పట్టించుకోకపోతే తెలుగుదేశం ఆఫీసులకు తాళాలు వేసుకోవాల్సి వస్తుందని తెలుగు 360.కామ్ చేసిన హెచ్చరిక నిజమవటానికి ఎక్కువసమయం పట్టేటట్లు లేదు.